మీకందరికీ ఒక ప్రశ్న.
మనలో కొంతమంది తెల్లగా, కొందరు చామన ఛాయ, కొందరు నలుపు వర్ణంలో ఎందుకున్నారు?
ఆలోచించండి....
సరే, 'రంగు కథ' వినండి... సారీ చదవండి!
సుమారు 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి బయలుదేరిన మానవ సమూహం తూర్పు, మధ్యాసియాలోని స్టెప్పీ పచ్చిక మైదానాలలో కొందరు, కొంతకాలం స్థిరపడిపోయారు. వారిలో కొందరు 60,000 సంవత్సరాలకు పూర్వం భారతదేశానికి వచ్చారు. సింధూ నదీ పరివాహ ప్రాంతాలకు చేరుకున్నారు. వీరే భారతదేశ ప్రథమ మానవ సమూహం. అంతవరకూ మన దేశంలో మానవజాతి లేదు. వీరిలో కొందరు దక్షిణ భారతానికి పయనించి, అక్కడ ఉండిపోయారు. వారిలో కొందరు అక్కడి నుంచి కూడా ప్రయాణించి, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా వైపు కొందరు, ఇంకొందరు తూర్పు ఆసియా, సైబీరియా, అక్కడ్నుంచి బేరింగ్ జలసంధి దాటుకుని అమెరికా ఖండాల్లో ప్రవేశించారు.
వీరంతా ఆఫ్రికా మానవులే.
మధ్య ఆసియాలో ఉన్న వారు పశువుల కాపరులుగా మారి ''యమ్నాయా'' కాపరుల జాతిగా మారారు. వేల సంవత్సరాలలో వీరి చర్మంలో మార్పు మొదలైంది. ఆ ప్రాంతాల్లో సూర్యరశ్మి, వెలుతురు తక్కువగా ఉన్నందు వల్ల చర్మపు రంగును నిర్ణయించే ఒక జీన్ SLC24A5 లో mutation వచ్చినందువలన మెలనిన్ వర్ణద్రవ్యం చర్మపు పొరల్లో తగ్గిపోయి, చర్మపు నలుపుఛాయ క్రమంగా తగ్గిపోయింది. ముఖ కవళికలలో కూడా మార్పు మొదలై, కాకసాయిడ్ రూపం (నిలువు లేదా కోల ముఖాలు) లోకి వచ్చారు.
మన శరీరపు రంగును అనేక జన్యువులు ప్రభావితం చేస్తాయి.అందులో 40% వరకూSLC24A2 జీన్ ప్రభావం ఉంటుంది. దీనిలోని ఉత్పరివర్తనమే మన శరీరం తెలుపు రంగులో మారేందుకు దోహదపడింది.
ఆ తరువాత..
ఈ విధంగా మార్పు చెందిన యమ్నాయా పశువుల కాపరులు తమ రథాలతో, గుర్రాలతో క్రీ.పూ 3500 సంవత్సరాల ముందు కాలంలో కొందరు యూరోప్ వైపు ప్రయాణించి అక్కడ జనావాసాలను, CORDED WARE సంస్కృతిని స్థాపించారు. కొందరు తూర్పు ఆసియా వైపు పయనించాక, అక్కడ వారి సంతతి ''ఆంద్రోనోవో'' ANDRONOVO, సింథాష్టా sintastha సంస్కృతులను స్థాపించాక, మళ్లీ అక్కడి నుండి కొంతమంది దక్షిణంగా పయనించి, పామీర్ పర్వతశ్రేణులను దాటుకుని, మధ్య ప్రాచ్య ఆసియా MIDDLE EAST భూభాగంలోకి ప్రవేశించారు. వీరే ఇండో ఇరానియన్లు INDO IRANIANS వీరిలో కొంతమంది ఉత్తరభారతంలోకి క్రీ.పూ.2000 నాటికి ప్రవేశించారు. వీరే మనం చెప్పుకుంటున్న ఆర్యులు లేదా INDO ARYANS. అప్పటికి అక్కడ సింధూ నాగరికత శిథిలదశలో ఉంది. ఆ దశలో అక్కడ ఉన్నవారితో వీరి సంపర్కం జరిగింది. అదే సమయంలో సింధు నాగరికత ప్రజలు కొంతమంది దక్షిణాపథానికి పయనమై అప్పటికే ఇక్కడ ఉన్న దక్షిణ భారతీయులతో (HUNTER GATHERERS, NEO LITHIC FARMERS) కలసిపోయారు. వారి సంతతే ద్రవిడులుగా మారారు.
ఉత్తర భారతంలోని ఈ రెండు జాతులవారు (యమ్నాయా మరియు సింధు ప్రజలు) క్రీ.పూ 1500 వరకూ బాగా కలసిపోయి, వీరి సంతతి దక్షిణ భారతానికి పయనించి, అక్కడి ప్రజలతో కూడా కలిసిపోయారు. అలా క్రీ.పూ. 1500 నుండి క్రీ.శ.1వ సంవత్సరం వరకూ ఈ జాతులన్నీ బాగా కలిసిపోయాయి. అంటే అప్పటికి ఈ మతాలూ, కులాలూ ఏర్పడి, వాటి మధ్య మాత్రమే వివాహాలనే దృక్పథం లేదు. క్రీ.శ.1 తరువాత నుండి ఇప్పటి వరకు కూడా కులాల, మతాల పట్టింపులు ఎక్కువై వివిధ సమూహాల కలయిక ఆగిపోయి, కేవలం కొన్ని సమూహాల ప్రజల మధ్య మాత్రమే వైవాహిక సంబంధాలు (ENDOGAMY) ఏర్పడినాయి.
ఇలా ..
ఈ(SLC24 A5మ్యటేషన్ భారతదేశంలోకి ''యమ్నాయా'' పశువుల కాపరుల సంతతుల ద్వారా ప్రవేశించి, మనలో వివిధ చర్మపు రంగుల మిశ్రమ ప్రజలు పుట్టుకొచ్చారు.
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం... అప్పటి ప్రాచీన భారతంలోకి ప్రవేశించిన వారు అచ్చంగా ఇప్పుడు మనదేశంలో లేరు. అంతరించిపోయారు. ఇప్పుడున్న మనదేశ ప్రజానీకం అందరూ మిశ్రమ సంతతే.అనేక జాతుల, సంస్కృతుల సంగమమే.
చూశారా....!
ఎర్రగా బుర్రగా ఉన్నావనే దాని వెనుక ఇంత చరిత్ర ఉంది.. ఇంత సైన్స్ ఉంది !
- డా. కాలేషా బాషా