May 05,2023 23:34

మనసున మనసై నాటికలో సన్నివేశం

ప్రజాశక్తి-తెనాలి: రంగస్థల కళావైభవానికి కళాపరిషత్‌లు ఆయవుపట్టుగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. మండలంలోని కొలకలూరు శివాలయం కూడలిలో కొలంకపురి నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటికల పోటీలను ఎమ్మెల్యే శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ప్రముఖ రంగస్థల నటులు డి.రామకోటేశ్వరరావు అధ్యక్షత వహించగా మఖ్యఅతిధిగా వి.సత్యసాయి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెనాలి ప్రాంతం ఎంతో మంది కళాకారులకు పుట్టిల్లన్నారు. కొలకలూరులో కళారంగానికి మంచి ఆదరణ ఉందన్నారు. తొమ్మిదేళ్లుగా కొలంకపురి నాటక కళాపరిషత్‌ నాటికల పోటీలు నిర్వహించటమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా కరణం సురేష్‌ జ్ఞాపకార్థం సవ్యసాచి పురస్కారంతో కళాపరిషత్‌ తరఫున ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు శ్రీపాద కుమారస్వామిని సత్కరించారు. నాటకోత్సవాల తొలిరోజున నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ ప్రాంగణంలో హైదరాబాద్‌కు చెందిన కళారంజని వారు 'మనిషి మంచోడే' నాటికను ప్రదర్శించారు. కాటా సుబ్బారావు రచనకు జెట్టి హరిబాబు దర్శకత్వం వహించారు. రెండో ప్రదర్శనగా ఏలూరుకు చెందిన హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 'మనసున మనసె'ౖ నాటికను ప్రదర్శించారు. నాటికకు రచన మల్లేశ్వరరావు, కృష్ణ హితేష్‌ కాగా మహ్మద్‌ ఖాజావలి దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో కళాపరిషత్‌ బృందం గోపరాజు వెంకట రమణమూర్తి, సుద్దపల్లి మురళీధర్‌, గోపరాజు విజరు, డివిఎస్‌ మూర్తి, షేక్‌ జానిబాషా పాల్గొన్నారు.