Oct 07,2021 06:48

ఇప్పుడు నగదీకరణ ప్రతిపాదనలను రంగాలవారీగా క్లుప్తంగా పరిశీలిద్దాం. 26 వేల కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్లను లీజుకిస్తున్నారు. ఆంధ్రాలో విజయవాడ - చిలకలూరిపేట, తెలంగాణలో హైదరాబాద్‌ - బెంగళూరు, కడ్తల్‌ - ఆర్మూర్‌, అడ్లూరు - ఎల్లారెడ్డి, చేగుంట - బోయినపల్లి రోడ్లు లీజుకిస్తున్న వాటిలో ఉన్నాయి. లీజుకు తీసుకున్న వారు ఎన్ని టోల్‌గేట్లు అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంతైనా రుసుం వసూలు చేసుకోవచ్చు. దానిపై ప్రభుత్వానికి ఎటువంటి అదుపు ఉండదు. రోడ్లన్నీ ప్రజలవని మనం అనుకుంటాం. కాని ఇపుడు ప్రజల ఆస్థిని ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా లాభం చేసుకోవటానికి ప్రైవేటు వారికి ఇస్తున్నారు.

29 వేల కిలోమీటర్ల విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ప్రైవేటీకరిస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలతో విద్యుత్‌ ప్రైవేటీకరణ సంపూర్ణమౌతుంది. ప్రజలపై విపరీతమైన భారాలు పడతాయి. చెల్లించలేని వారు విద్యుత్‌కు దూరమై పాతకాలంలో వలె దీపాలు పెట్టుకొని, పొద్దుగూకగానే పడుకొనే పరిస్థితి వస్తుంది.

600 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుదుత్పత్తి కేంద్రాలను కూడా ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. జల విద్యుత్‌ ఉత్పత్తికి ఖర్చేమీ ఉండదు. కాబట్టి ఆ కేంద్రాలను ప్రైవేటు వారికిస్తే వారికి విపరీతమైన లాభాలస్తాయి. కాని మన జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలన్నీ వ్యవసాయంతో ముడిపడి వున్నాయి. జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ప్రైవేటు వారి చేతిలోకి వెళితే వ్యవసాయ అవసరాలను పరిగణన లోకి తీసుకోకుండా, తమ లాభాల కోసం జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదులుతారు. సాగర్‌, పులిచింతల నిండుగా ఉన్నపుడు శ్రీశైలంలో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, నీటిని కిందికి వదిలితే నీరంతా సముద్రం పాలవటమే కదా! ఆ విధంగానే సాగర్‌లో కూడా చేస్తే జలాశయాలు ఖాళీ అవుతాయి. ఉదాహరణకు సాగర్‌, శ్రీశైలం ఖాళీ అయిన తర్వాత వ్యవసాయ అవసరాలకు నీరు లేకుండా పోతుంది. ఆ విధంగా ఇది కేవలం విద్యుత్‌ సమస్య మాత్రమే కాకుండా వ్యవసాయం, రైతాంగ సమస్య కూడా అవుతుంది.

పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే 3,930 కి.మీ పైప్‌లైన్‌లను, 8,154 కి.మీ సహజవాయు పైప్‌లైన్ల్‌ను లీజుకు ఇస్తున్నారు. ఆంధ్ర లోని ఐదు వందల కిలో మీటర్ల పైప్‌లైన్లు కూడా దీనిలో ఉన్నాయి. వీటిలో నుండి పెట్రోలు, గ్యాస్‌ను తీసుకెళితే ప్రైవేటు వారికి ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ తదితరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనితో మరింతగా పెరుగుతాయి.

400 రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరిస్తున్నారు. 90 పాసింజరు రైళ్ళు, 265 గూడ్స్‌షెడ్లు ప్రైవేటువారికి ఇవ్వబోతున్నారు. ప్రతి పట్టణంలోనూ రైల్వే కాలనీలను గుర్తించి, డెవలప్‌మెంట్‌ పేరుతో వాటిని తీసుకొని, ఉద్యోగులను అక్కడ నుండి పంపివేస్తారు. రైల్వే స్టేడియంలను ప్రైవేటువారికి ఇస్తారు. వారికిచ్చిన తర్వాత రైల్వే ఉద్యోగులతో పాటు సాధారణ పౌరులకు కూడా డబ్బు ఇస్తేనే ప్రవేశం ఉండవచ్చు. లేదా వాటిని మాల్స్‌గా తయారు చేయవచ్చు. దురంతో, శతాబ్ది, రాజధాని లాంటి బాగా లాభాలచ్చే 90 రైళ్ళను ప్రైవేటీకరిస్తున్నారు. లాభాలచ్చేవన్నీ ప్రైవేటు వారికి వెళ్ళిన తర్వాత నష్టాలచ్చేవి ప్రభుత్వం వద్ద మిగులుతాయి. కాబట్టి క్రాస్‌ సబ్సిడీ ఇవ్వగలిగిన శక్తి రైల్వేలకు ఉండదు.

మూడు లక్షల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫౖౖెబర్‌ నెట్‌వర్క్‌ను 14,917 టెలికాం టవర్లను లీజుకు ఇవ్వబోతున్నారు. జియో వారు వాటిని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. 25 విమానాశ్రయాలను, ఇందులో ఆంధ్రప్రదేశ్‌ లోని రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలను ప్రైవేటువారికి ఇవ్వబోతున్నారు. నాలుగు వేల టవర్లను కూడా లీజుకు ఇవ్వబోతున్నారు. 9 పెద్ద ఓడరేవులలో 31 బెర్తులను, అందులో విశాఖ పోర్టులో తొమ్మిది బెర్తులను లీజుకు ఇవ్వబోతున్నారు.

తర్వాత 2 కోట్ల 10 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన ఎఫ్‌సిఐ, వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్ల గోడౌన్లను ప్రైవేటీకరిస్తున్నారు. గోడౌన్లు ప్రైవేటు పరమైతే ప్రభుత్వం ఆహారధాన్యాలను సేకరించటం ఉండదు. ప్రభుత్వం వద్ద ఆహారధాన్యాలు ఉండవు కాబట్టి ప్రజలకు తక్కువ ధరలకు అందించటం ఉండదు. ఒకవేళ ప్రజలకు అందించాల్సి వస్తే ప్రభుత్వం పెట్టుబడిదారుల నుండి కొనుగోలు చేసి, పంపిణి చేస్తుంది. అపుడు ప్రజలకు పంపిణి చేసినట్లూ ఉంటుంది. పెట్టుబడిదారులకు లాభాలూ వస్తాయి. ఇపుడు ప్రజలకు పంపిణీ అవుతున్నా, పెట్టుబడిదారులకు లాభాలు రావటం లేదు. ఈ గోడౌన్లన్నింటినీ తీసుకోవటానికి అదాని వంటివారు సిద్ధంగా ఉన్నారు. వారు వ్యవసాయ రంగం, వ్యవసాయ మార్కెట్ల లోకి ప్రవేశించాలనుకుంటున్నారు. గోడౌన్లు నిర్మించే శ్రమ లేకుండా ఇవన్నీ వారి చేతిలోకి వెళ్ళిపోతాయి. వీటిలో పనిచేస్తున్న హమాలీలు, రైల్వేలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధికి ప్రమాదం వస్తుంది.

త్వరలో జాతీయ భూ నగదీకరణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల వద్దవున్న ఖాళీ భూమిని ఈ కార్పొరేషన్‌ తీసుకుంటుంది. ఈ భూమిని రియల్‌ ఎస్టేట్‌ ఇతర అవసరాలకు ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అమ్ముతుంది లేదా లీజుకిస్తుంది. ఈ సంస్థ సేవలను కేంద్రమే కాకుండా రాష్ట్రాలు కూడా వినియోగించుకోవచ్చు. టెలికాం కంపెనీలు, హెచ్‌.ఎం.టిల వద్ద వున్న 2,000 ఎకరాల భూమితో ఈ కార్పొరేషన్‌ పని ప్రారంభమయ్యే అవకాశం వుంది.

నగదీకరణ కార్యక్రమాన్ని కేంద్ర స్థాయికే పరిమితం చెయ్యాలని మోడీ ప్రభుత్వం అనుకోవడం లేదు. తమతమ రాష్ట్రాలలో నగదీకరణ చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నోడల్‌ ఆఫీసర్లను నియమించాలని కోరింది. ఇప్పటికే రాష్ట్రాల నోడల్‌ ఆఫీసర్లకు నీతి ఆయోగ్‌ వారు 'నగదీకరణ'పై ఒక కార్యశాలను కూడా నిర్వహించారు.

రాష్ట్ర స్థాయితో ఆగకుండా, పంచాయితీ స్థాయిలో వనరుల నగదీకరణను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామ సభల సంవత్సర పని క్యాలెండర్‌ వివరిస్తూ ఒక సూచన పత్రాన్ని పంపింది. ఆందులో గ్రామ స్థాయిలో పంచాయితీ ఆధీనంలో వున్న ఆస్తులను నగదీకరించు కోవడానికి పూనుకోవాలని కోరింది.

పైన వివరించిన అంశాలను గమనిస్తే బి.జె.పి ప్రభుత్వం ప్రైవేటీకరణ, నగదీకరణ పేరుతో దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పెట్టుబడి వశం చేయడానికి సాధ్యమైనంత వేగంగా అన్ని రంగాలలో ప్రభుత్వ పాత్రను ఉపసంహరించడానికి పూనుకున్నదని విదితం అవుతున్నది.
నగదీకరణ పర్యవసానాలు

ఇవన్నీ ప్రైవేటు వారికి ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మొదటిది ధరలు విపరీతంగా పెరుగుతాయి. ప్రైవేటు వారు లాభం కోసం లీజుకు తీసుకున్నారు కాబట్టి యూజర్‌ ఛార్జీలు వేస్తారు. అందువలన ధరలు పెరుగుతాయి.

రెండవది వీటిలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు వారు ఉద్యోగులను ఉంచుతారని గ్యారంటీ లేదు. పది మందికి ఉద్యోగాలు పోతే ఇరవై మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి చెబుతున్నాడు. అంటే ఉద్యోగులను ప్రైవేటు వారు ఉంచరని స్పష్టమౌతున్నది.
మూడవది ఇప్పటి వరకు ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు అమలు జరిగాయి. ప్రైవేటు వారి చేతిలోకి పోతే రిజర్వేషన్లు ఉండవు. పర్మినెంటు ఉద్యోగాలు ఉండవు. అన్నీ కాంట్రాక్టు ఉద్యోగాలే ఉంటాయి.

ఈ అమ్మకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు? సాధారణ పౌరులు, మనలాంటి వారు వీటిని లీజుకు తీసుకోవటం, కొనటం చేయగలరా? కార్పొరేట్‌ సంస్థలు మాత్రమే వీటిని కొనగలవు. వీటిని కొనుగోలు చేసిన తర్వాత ప్రతి రంగంలోనూ కొద్ది మంది గుత్తాధిపత్యం సాధించటానికి అవకాశం ఏర్పడుతుంది. టెలికాం రంగంలో జియో, ఎయిర్‌ టెల్‌ ఉన్నాయి. పోర్టులు అదాని తీసుకొంటున్నాడు. విమానాలు టాటాలు తీసుకోవచ్చు.

ప్రైవేటైజేషన్‌, మానిటైజేషన్‌ తదితర కార్యక్రమాలతో సంవత్సరాల తరబడి ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగాన్ని నాలుగు సంవత్సరాలలో మాయం చేస్తున్నారు. మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలు, నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చారు. 370 అధికరణాన్ని రద్దుచేశారు. రాష్ట్రాల హక్కులను నాశనం చేస్తున్నారు.

ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నపుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. పోరాటాలలోకి వస్తారు. రైతులు పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేశారు. వీటిని అణచివేయటానికి తీవ్రమైన నిర్బంధాన్ని పాలకులు అమలు చేస్తున్నారు. మరీ వ్యతిరేకిస్తున్నవారిని దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారు. గతంలో ఎమర్జెన్సీ అని ప్రకటించి నిర్బంధాన్ని ప్రయోగించారు. ఈనాడు ప్రకటించకుండానే ఎమర్జెన్సీకి మించిన నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ప్రైవేటీకరణ, నగదీకరణల ద్వారా సంపదలను పెట్టుబడిదారులకు అప్పగించాలంటే ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలి. ప్రశ్నించే వారిని జైళ్ళలో నిర్బంధించాలి. జైళ్ళలో ఉండటం, బతికి వుండటం కూడా ప్రమాదం అనుకుంటే పైకి పంపాలి. పన్సారేను, మరికొందరిని అలాగే హత్యలు చేశారు. అందుకే ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం కూడా సాగాలి.
 

రంగాలవారీగా నగదీకరణ

 

 

 

 

( వ్యాసకర్త సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు)