Jul 04,2023 21:07

సౌమ్యనాథుని కల్యాణంలో మాంగల్యం చూపుతున్న వేదపండితులు

నందలూరు : జిల్లాలో చారిత్రాత్మక, సుప్రసిద్ధ వైష్ణవ దేవాలయమైన శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథుని కల్యాణ మహోత్సవం కమనీయంగా... రమనీయంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి కల్యాణం చూచువారులకు చూడ ముచ్చటగా సాగింది. కల్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. వేద పారాయణులు సంతోష్‌ కృష్ణ శర్మ ఆధ్వర్యంలో టిటిడి అర్చకులు సునీల్‌ కుమార్‌ శర్మ,సాయి కృష్ణ శర్మ, బాలస్వామి, రుత్వికులు శ్రీనివాస్‌, ఎంజి కృష్ణ తరుణ్‌ పార్థసారథి, భార్గవ్‌, సీతారాం, ప్రశాంత్‌, మనోజ్‌ కుమార్‌, పవన్‌ ఆచార్యులు శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ వేడుకలకు ఉత్సవమూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల మధ్య కళ్యాణ వేదిక పైన ఆశీనులు గావించారు. పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. ఉదయం అభిజిత్‌ లగమందు కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. వేద పండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మాంగల్య ధారణ ,ముత్యాల తలంబ్రాలు క్రతువులను నిర్వహించారు.
ముత్యాల తలంబ్రాలను సమర్పించిన 'మేడా' : స్వామివారి కల్యాణ వేడుకకు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్త్రాలను ఆలయ అర్చకులకు అందజేశారు. ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కల్యాణానికి హాజరైన ప్రముఖులు : సౌమ్యనాథుని కల్యాణ మహోత్సవానికి ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపిపి మేడా పద్మజ, జడ్‌టిసి గడికోట ఉషారాణి, సిద్ధవటం వైసిపి ఇన్‌ఛార్జ్‌ మేడా మధుసూదన్‌రెడ్డి, ఆర్‌టిసి మాజీ రీజినల్‌ చైర్మన్‌ ఎద్దుల సుబ్బరాయుడు, రాజంపేట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎద్దుల విజయసాగర్‌, జనసేన నాయకులు అతికారి దినేష్‌, సినీ నటులు వేణు, సౌమ్యనాథాలయ మాజీ చైర్మన్‌ అరిగెల సోమిత్రిచంద్రనాథ్‌, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భువనబోయిన లక్ష్మీనరసయ్య హాజరయ్యారు. వీరిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.
భక్తులకు అన్నదానం : కల్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్‌ మేడా రామకృష్ణారెడ్డి, ఎంఆర్‌కెఆర్‌ కన్స్ట్రక్షన్‌ అధినేత మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మేడా విజయ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో, గంగమ్మ సర్కిల్‌ వద్ద మేడా విజయ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట డిఎస్‌పి చైతన్య ఆధ్వర్యంలో రాజంపేట సిఐ పుల్లయ్య, నందలూరు ఎస్‌ఐ మహమ్మద్‌ అబ్దుల్‌ జహీర్‌ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. కల్యాణ మహోత్సవం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామిని ఆలయం చుట్టూ పల్లకీలో ఊరేగించి అనంతరం మాడవీధుల్లో భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథుడు దర్శనమిచ్చారు. స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
ప్రజలకు ఆటో సేవలు: జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జనసేన నాయకులు గురివిగారి వాసు, శంకర, శ్రీను ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేసిన ఆటో సర్వీసులను జనసేన నాయకులు అతిగారి దినేష్‌, జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రారంభించారు.
బ్రహ్మోత్సవాలలో నేడు: సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం వైభవంగా రథోత్సవం నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇఒ నటేషన్‌ తెలిపారు.