ప్రజాశక్తి- అనకాపల్లి
సిఐటియు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, సిపిఎం జిల్లా మాజీ కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్.రమేష్ ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో సోమవారం రమేష్ ఐదో వర్ధంతి సభ పిఎన్‌వి.పరమేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన లోకనాథం రమేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే కామ్రేడ్ రమేష్ వామపక్ష భావాలతో ప్రజల తరఫున పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అతి చిన్న వయసులోనే రమేష్ మరణించడం పార్టీకి, కార్మిక, అణగారిన వర్గాలకు తీరని లోటన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, కార్మిక చట్టాల సవరణతో కార్మికులకు, పేద, మధ్య తరగతి వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు, నాయకులు ఎం.సూర్యకళ, కనకాల రాజు, మజ్జి శంకర్రావు, పలక సత్యనారాయణ, రెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసి కార్మికుల పక్ష నాయకునిగా రమేష్ కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సిఐటియు సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ కొనియాడారు. సిఐటియు విశాఖ జిల్లా పూర్వ కార్యదర్శి ఎస్.రమేష్ వర్థంతి సభ మద్దిలపాలెంలోని సిఐటియు కార్యాలయంలో జరిగింది. తొలుత రమేష్ చిత్రపటానికి అజశర్మ, జివిఎన్.చలపతి, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌లు పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ విద్యార్థి దశ నుండే పోరుబాటలో పయనించారన్నారు. జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వారిని చైతన్యపరిచి ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.జగన్, చంద్రమౌళి పాల్గొన్నారు.
మల్కాపురం : స్థానిక సిఐటియు కార్యాలయంలో రమేష్ వర్థంతి కార్యక్రమం చేపట్టారు. రమేష్ చిత్రపటానికి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రమేష్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. రమేష్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, అధ్యక్షులు కె.పెంటారావు, నాయకులు జగన్నాథరావు, గాంధీ, శ్రీను, శంకరరావు, అప్పాజీ పాల్గొన్నారు.
ఆనందపురం : సరిపిల్ల రమేష్ జీవితం ఉద్యమాల స్ఫూర్తి అని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జి.రమణ పేర్కొన్నారు. మండలంలోని బొడ్డపాలెం రమేష్ భవనంలో సిపిఎం ఆధ్వర్యాన వర్థంతి సభ నిర్వహించారు. రమేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి నాయకులు దల్లి రాంబాబు పలు ఉద్యమ, ప్రజా గేయాలను ఆలపించారు. కె.నాగరాణి, కె.ద్రాక్షాయిని, జి.సుమిత్ర, బి.శరత్చంద్ర, జె.వెంకటరావు, కె.రమణ, శిరీష పాల్గొన్నారు.
అచ్యుతాపురం : కార్మికోద్యమ నేత కామ్రేడ్ ఎస్.రమేష్ ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.రాము, మండల కార్యదర్శి కె.సోమునాయుడు, నాయకులు కనకరాజు, శ్రీను, అబ్బాయి నాయుడు పాల్గొన్నారు.
రాంబిల్లి : మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యాన నిర్వహించినరమేష్ వర్థంతి కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జి.దేముడునాయుడు మాట్లాడుతూ రమేష్ నాడు నేవీ నిర్వాసితుల పోరాటంలో పాల్గొని వారి వాణిని జిల్లా అంతటా వినిపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు బద్ది భాస్కరరావు, సిహెచ్.గంగరాజు, ఎస్.నారాయణరావు, సిహెచ్.నూకన్న, కాశి, నాగబాబు, అప్పలరాజు, ఎర్రయ్య, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : మండలంలోని ఫార్మాసిటీలో నిర్వహించిన రమేష్ వర్థంతి సభలో ఆయన చిత్ర పటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్రి వెంకయ్య నాయుడు, ఆడారి రాజు, కర్రి పెంటారావు, బి.రాము, కె.కృష్ణ పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక దుర్గమాంబ ముఠా కళాసీ సంఘం కార్యాలయంలో జరిగిన రమేష్ వర్థంతి సభలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రమేష్ కార్మికుల సమస్యలపై రమేష్ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, అంగన్వాడీ యూనియన్ నాయకులు వివి.రమణమ్మ, వసంత, పలువురు ముఠా కార్మికులు పాల్గొన్నారు.
నక్కపల్లి:స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ ఎస్.రమేష్ 5వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ రమేష్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం అప్పలరాజు, నాయకులు వాతాడా అప్పారావు, పిల్లి తాతారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ, ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన రమేష్ చేశారని, ఆయన లేని లోటు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మనబాల రాజేష్, దండుబాబు, వీరన్న, కార్మికులు పాల్గొన్నారు.










