ప్రజాశక్తి-హెల్త్‌యూనివర్శిటీ: గుంటూరులోని రమేష్ హాస్పటల్స్‌లో రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవంతంగా 'మెట్రా క్లిప్స్' చికిత్సను నిర్వహించినట్లు రమేష్ హస్పటల్స్ సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ నాగశ్రీ హరిత తెలిపారు. రమేష్ హస్పటల్స్ నందు మంగళవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 78 సంవత్సరాలు వయసు కలిగిన రోగి ఆయాసం, నిస్సత్తువ వంటి లక్షణాలతో మంచానికే పరిమితమైన స్థితిలో కుటుంబ సభ్యులు రమేష్ హాస్పటల్స్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. గతంలో క్యాన్సర్ చికిత్స, గుండె రక్తనాళాలకు స్టెంట్ యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్య చరిత్ర కలిగిన ఆరోగికి గుండె వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గుండె వైద్య పరీక్షల్లో గుండె కవాటమైన మైట్రల్ వాల్వ్ లీక్ అవుతున్నట్లుగా నిర్థారణ అయ్యిందన్నారు. రోగి యొక్క వయసు అనారోగ్య సమస్యలు, గతంలో జరిగిన వైద్య చికిత్సలు, వాల్వ్ మార్పిడి శస్త్ర చికిత్సకు సహకరించనందున ఇన్వేజివ్ పద్దతిలో నిర్వహించే 'మైట్రా క్లిప్' చికిత్స ఉపకరిస్తుందని కుటుంబ సభ్యులకు తెలియచేసి విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సాదారణంగా మైట్రల్ వాల్వ్ లీక్ గుండెపోటు వలన గాని, కవాట నిర్మాణంలో తలెత్తే లోపాల వలన గాని సంభవిస్తూ ఉంటాయన్నారు. ఇటువంటి రోగులలో ఓపెన్ హార్ట్ ద్వారా వాల్వ్ మార్పిడి శస్త్ర చికిత్స కానీ, మందులతో కానీ 99 శాతం సత్పలితాలను ఇవ్వవమని తెలిపారు. ఈవ్యాధితో జీవనకాల వ్యవధి కూడా రెండు నుండి మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో ఇటువంటి లక్షణాలు ఉన్న రోగులకు ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స వైద్య విధానాలు అందుబాటులో ఉండేవికావన్నారు. కాని ఈమద్య కాలంలో వచ్చిన అత్యాధునిక వైద్య విదానమైన ఎటువంటి కోత గాటు లేకుండా యాంజియోగ్రామ్ పద్దతిలో ఇన్వేజివ్ విధానంలో నిర్వహించే ' మైట్రా క్లిప్ ' వైద్య చికిత్స మైట్రల్ వాల్వ్ లీక్ రోగులకు స్వాంతన కలిగిస్తుందని అన్నారు. రోగికి గత ఆదివారం నాఉ రాష్ట్రంలో మొదటిసారిగా విజయవంతంగా సీనియర్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ దగ్గుపాటి రమేష్ ఆధ్వర్యంలో వైద్య చికిత్స అందించినట్లు తెలిపారు. అమెరికా, యూరోపియన్ వంటి దేశాల్లో గత రెండేళ్లుగా ఈవైద్య చికిత్సను చేస్తున్నారని, మన దేశంలో కూడా అతి కొద్ది సెంటర్లలో మాత్రమే ఈవైద్య చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఈరోగికి వాల్వ్ లీకేజీ గణణీయంగా తగ్గి మంగళవారం డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. చికిత్సలో కార్డియాక్ ఎనస్థటిస్ట్ డాక్టర్ బికాస్ సాహు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ జయరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని రమేష్ హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు అభినందించారు.










