Jan 24,2023 23:04

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: రమేష్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో విజయవాడ శ్రీనివాసనగర్‌ బ్యాంక్‌ కాలనీలోని ఇండోబ్రిటీష్‌ హాస్పటల్‌లో గుండె జబ్బుల ప్రత్యేక వైద్య విభాగం ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నట్లు డాక్టర్‌ రమేష్‌ హాస్పటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు తెలిపారు. ఆసుపత్రి కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా ఇండో బ్రిటీష్‌ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో క్లౌడ్‌ డాక్స్‌ (టెలి ఐసియు)కు అనుసంధానం చేయడం ద్వారా 24 గంటలూ రోగులు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారన్నారు. ఇక్కడ 50 పడకలతో అంతర్జాతీయ స్థాయి మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌, అత్యాధునిక క్యాత్‌ల్యాబ్‌ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ పి.వి.ఎస్‌. శ్రీనివాస్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో కార్డియాలజిస్టు డాక్టర్‌ షహనాజ్‌, ఎలక్ట్రోఫిజియాలజిస్టు డాక్టర్‌ చంద్రమౌళి, చిన్న పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ జ్యోతి ప్రకాష్‌, డాక్టర్‌ వాసుదేవ్‌, సీనియర్‌ గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్‌ జయరాంపారు, డాక్టర్‌ శివ ప్రసాద్‌, డాక్టర్‌ భరత్‌ సిద్దార్థలతో కూడిన వైద్య బృందం ఉంటుందన్నారు. హార్ట్‌ ఎటాక్‌, స్టెంట్‌ యాంజియోప్లాస్టీ, బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ మార్పిడి సర్జరీ, ఫేస్‌మేకర్‌, రేడియో ఫ్రీక్వెన్సీ, అబ్లేషన్‌, హార్టు ఫెయిల్యూర్‌కు సీఆర్‌డి, చిన్న పిల్లల గుండె జబ్బులకు వైద్య బృందం వైద్య సేవలందిస్తుందని తెలిపారు. ఇన్సూరెన్స్‌ పేషెంట్లతో పాటు కార్పొరేట్‌ రంగ ఉద్యోగులకు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌, జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌ లబ్థిదారులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు లేని పేదలకు ఆరోగ్యభాగ్యం స్కీంలో రాయితీతో కూడిన వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. రమేష్‌ హాస్పటల్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పావులూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో విజయవంతంగా 19 వేల యాంజియోప్లాస్టీ బైపాస్‌ సర్జరీ చిన్నపిల్లల గుండె చికిత్సలు, ఫేస్‌మేకర్‌లు నిర్వహించామన్నారు. 26వ తేదీ ఉదయం 11 గంటలకు రమేష్‌ హాస్పటల్స్‌ చైర్మన్‌ ఎం.ఎస్‌.రామమోహనరావు చేతుల మీదుగా వైద్య విభాగాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ ఎం.సి.దాస్‌, కార్డియాలజిస్టు డాక్టర్‌ షహనాజ్‌ పలువురు పాల్గొన్నారు.