పుల్లంపేట : జిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. చిన్నఓరంపాడు మలుపు వద్ద జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా ఢకొీట్టింది. ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢకొీన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స కోసం రాజంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంటే తిరుపతికి తరలించారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమదానికి కారణమని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంలో ఓబులవారిపల్లె మండలంలోని జ్ఞానంపల్లికి చెందిన గుండాల శ్రీనివాసులు(55), రాజంపేట మండలం వెంకట రాజంపేటకు చెందిన కోమవతి శేఖర్ (45), చిట్వేలికి చెందిన దుగ్గిలపాడు అమర్‌నాథ్‌రెడ్డి(48), కడపకు చెందిన కమలోకర్ బాషా (65) మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. సంఘటనపై ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










