May 14,2023 23:34

మాట్లాడుతున్న గిరిజన సంఘం నేతలు సన్నిబాబు, పృధ్విరాజు

ప్రజాశక్తి-పెదబయలు:స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన అంబిరి లావణ్య (11) రక్తహీనతతో మృతి చెందింది. వేసవి సెలవులకు ముందునుండే లావణ్య రక్తహీనతో బాధపడుతుంది. శనివారం విశాఖపట్నం కెజిహెచ్‌ హాస్పిటల్‌లో సరిగా చికిత్స అందక పోవడంతో మృతి చెందినట్లు మృతురాలు తల్లిదండ్రులు అంబిరి కృష్ణారావు, కృష్ణవేణిలు తెలిపారు. గిరిజన సంఘం పూర్వ అధ్యక్షుడు బొండా సన్నిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్విరాజ్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు విద్యార్థిని మృతికి కారణాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ, వేసవి సెలవుల కన్నా ముందు నుండే విద్యార్థిని రక్తహీనతతో బాధపడుతున్నా కనీసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఎందుకు చికిత్స చేయించలేదని అక్కడే ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడు చెట్టి నారాయరణను నిలదీశారు. ఫోన్‌ చేసినా ఎందుకు రెస్పాండ్‌ కాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ వార్డెన్‌ భాగ్యవతి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదన్నారు. విద్యార్థికి చికిత్స అందించాలని తల్లిదండ్రులు కోరినా పట్టించుకోలేదన్నారు. హెచ్‌ఎం, వార్డెన్లులు మీ పిల్లలైతే ఇట్లనే శ్రద్ద కనబరుస్తారా? అని ప్రశ్నించారు. అనంతరం పాడేరు ఐటిఎ ప్రాజెక్ట్‌ అధికారి అభిషేక్‌కు చరవాణిలో గిరిజన సంఘం నేతలు ఈ ఘటన వివరాలను తెలిపారు. అనంతరం సిరిసపల్లి గ్రామస్థులు, బంధువులు ఆందోళన చేశారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గలగండ సర్పంచి లోహితసు, మాజీ సర్పంచ్‌ లక్ష్మణ్‌, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.