Oct 19,2023 20:51

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం: రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు, ప్రభుత్వ పథకాల అమలుకు పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తీసుకుంటున్న చర్యలు, ప్రణాళిక అభినందనీయమని, మారుమూల గిరిజన ప్రాంతాలకు ఉపాధి హామీ పనులు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య, విద్యా, శిశుసంక్షేమ శాఖలు, ఇతర అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలను వివరిస్తూ రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, బాలికలు, బాలింతలు, శిశువుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను అధిగమించేం దుకు వైద్య, విద్యా, మహిళా శిశుసంక్షేమ శాఖల సమన్వయం పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటినీ సర్వే చేసి రక్తహీనత, పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తిస్తున్నారని, వారికి మందులు, పోషకాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైరిస్కు గర్భిణుల కేసులను మెడికల్‌ అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నరని తెలిపారు. వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. నాడు-నేడు పనుల ద్వారా పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్ల వసతి కల్పించడం జరిగిందని, టెన్త్‌ ఫలితాల్లో రాష్టంలోనే ఉత్తమ ఉత్తీర్ణతా శాతం సాధించినట్లు తెలిపారు. టీకా, ఫ్యామిలీ డాక్టరు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, జగనన్న సురక్ష శిబిరాలు వివరాలను ముందుగా ప్రజలకు తెలియపరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెసి ఆర్‌.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాధరావు, జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.