Sep 01,2023 00:42

సమీక్షలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విద్యార్థినుల్లో రక్తహీనతలను తగ్గించేదుకు 'బంగారు తల్లి' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని 23వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రకటించారు. దీనిపై తహశీల్దార్లు, ఎంఇఒలు, మున్సిపల్‌ కమిషనర్‌లతో కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలు నుండి గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 55 వేల మంది విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించగా 44 వేలకుపైగా విద్యార్థినుల్లో రక్తహీనత ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీన్ని తగ్గించేందుకు బంగారు తల్లి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి మూడు నెల్లకోసారి రక్త పరీక్షలు నిర్వహించి ఆ వివరాలను కార్డుల్లో నమోదు చేసి తల్లిదండ్రులకు పంపాలని, తల్లిదండ్రుల సంతకం అనంతరం పాఠశాలలో భద్రపరచాలని చెప్పారు. బడి బయటి పిల్లలు 19423 మందిని గుర్తించగా వీరిలో 18241 మందికి రక్త పరీక్షలు నిర్వహిస్తే 12137 మందికి రక్తహీనత ఉన్నట్లు నిర్థారణైందన్నారు. కార్డుల ముద్రణకు ఒక్కో కార్డుకు రూ.15 చొప్పున దాతల నుండి లేదా తల్లిదండ్రులే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నగదు జిల్లా విద్యాశాఖాధికారి ఖాతాలో జమయ్యేట్లు చూడాలన్నారు. బడి నుండి ఇంటికి వచ్చిన పిల్లలకు పౌష్టిక ఆహారం అందించేలా తల్లి తండ్రులలో అవగాహనా కల్పించాలన్నారు. విజ్ఞాన్‌ సంస్థ ద్వారా ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని, దానిలో ఎప్పటికప్పుడు వివరాలు భౌతికముగా ఎఎన్‌ఎం ఆన్‌లైన్‌లో మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి పొందుపరచాలని సూచించారు. దీనిపై మండల స్థాయిలో వచ్చే మంగళవారం సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఒ శామ్యూల్‌, ఐసిడిఎస్‌ అధికారి అరుణ, రీజనల్‌ ఇంటర్‌ మీడియట్‌ అధికారి జుబెరు పాల్గొన్నారు.
ఓట్ల తొలగింపుపై శిక్షణ
ప్రత్యేక సారాంశ సవరణ-2024 (ఎస్‌ఎస్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు ప్రత్యేకాధి కారులను నియమించి వారికి గురువారం ఉదయం ఓటర్లు జాబితా సవరణపై జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎస్‌ఆర్‌.శంకరన్‌ వీడియో కాన్ఫరెన్సు హాలులో గురువారం శిక్షణిచ్చారు. తొలగించిన ఓటర్లపై క్షేత్రస్థాయిలో పరిశీలిం చాలని, మొదటిగా బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ పరిశీలించి ఇచిన నివేదికను ఎలెక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ధ్రువీకరించి తగిన నమూనాలో నియోజకవర్గ ప్రత్యేకాధికారికి ఇస్తారని అన్నారు. ప్రత్యేకాధికారి పరిశీలన అనంతరం నిర్దిష్ట నమూనాలో జిల్లా ఎన్నికల అధికారికి అందించాలని చెప్పారు. ప్రత్యేకాధికారి స్థాయిలో సుమారు 500 మంది తొలగించిన ఓటర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి కారణాలను నమోదు చేయాలన్నారు. ఓటర్ల తొలగింపుపై డిఆర్‌ఒ వివరించారు. కార్యక్ర మంలో జిల్లా వ్యవసాయ ట్రేడింగ్‌, మార్కెటింగ్‌ అధికారి సూర్యప్రకాష్‌రెడ్డి, హార్టిక ల్చర్‌ అధికారి బెన్ని, పుడా వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, జిల్లా మైనర్‌ ఇర్రిగేషన్‌ అధికారి ఆంజనేయులు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ వరలక్ష్మి, డ్వామా పీడీ జోసెఫ్‌ కుమార్‌ పాల్గొన్నారు.