
ప్రజాశక్తి-దేవరాపల్లి
జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిని పరిశీలన చేసిన అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. వైద్యాధికారి ఎస్.లలితతో మాట్లాడి పీహెచ్సీలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రక్తహీనత ఉన్న వారిని గుర్తించి ఆన్లైన్ డేటాలో నమోదు చేయడం జరుగుతుందని, వారికి ప్రతి నెల వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా 38 పీహెచ్సీలు మరమ్మతు పనులు చేపట్టామని, కొత్తగా ఏడు పిహెచ్సిల్లో నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 39 104 వాహనాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారని, వాటిలో పూర్తిస్థాయిలో మందులు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు 377 మంజూరు కాగా, వాటిలో 10 పూర్తి స్థాయిలో ప్రారంభమైనట్లు వెల్లడించారు 143 జీవో ప్రకారం పిహెచ్సిల్లో 14 మంది సిబ్బందిని జూన్ నెలలోగా ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అన్ని పిహెచ్‌సిల్లో 170 రకాల మందులు అందుబాటులో ఉంచామని, 60 రకాల టెస్టులు చేయటానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు