Oct 01,2022 23:21

మాట్లాడుతున్న కలెక్టోర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి -పాడేరు:
పాడేరు ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న రక్తహీనత సమస్యను అధిగమించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. శనివారం ఆయన కార్యాలయంలో 11 మండలాల వైద్యాధికారులు, సిడిపిఓలతో మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతినెల మొదటి మంగళవారం మండల స్థాయిలో వైద్యాధికారులు, ఐసిడిఎస్‌ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, మహిళా పోలీస్‌, సచివాలయం ఏఎన్‌ఎంలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వైద్య, ఐసిడిఎస్‌ సిబ్బంది సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రక్తహీనతతో ఉన్న చిన్నారులు, తల్లులకు అంగన్వాడీల కేంద్రాల ద్వారా ప్రత్యేక పోషకాహారం అందించాలని సూచించారు. ఐరన్‌ పోలిక్‌ మాత్రలు పంపిణీ చేసి సక్రమంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులపై కమిటీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసి నిధులను వైద్య సదుపాయాలు, అత్యవసర ఔషధాల కొనుగోలుకు వినియోగించాలన్నారు. వైద్య సేవల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది వైద్యాధికారుల మాట వినకుండా పైరవీలు చేస్తే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు.
ఐటిడిఏ పిఓ రోనంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని, నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్యాధికారి లీలా ప్రసాద్‌, 11 మండలాల వైద్యాధికారులు, సిడిపివోలు , తదితరులు పాల్గొన్నారు.