Oct 28,2023 23:05


ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : ఈ భూమి మీద ప్రత్యామ్నాయంగా తయారు చేయలేనివి ఏదైనా ఉన్న దంటే అది మానవ రక్తమేనని, అలాంటి రక్తం దానం చేస్తున్న ప్రతి ఒక్కరు ఆదర్శ వంతులేనని జిల్లా ఎస్పీ పి జాషువా కొనియాడారు.పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా స్పందన సమావేశ మందిరంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని , అలాంటి ప్రత్యామ్నాయం లేని రక్తం దానం చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్న పోలీస్‌ సిబ్బంది అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు. మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతుందని అలాగే ఎంతోమందికి ఆదర్శవంతులని పోలీస్‌ సిబ్బందిని కొనియాడారు. అలాగే క్షణం తీరిక లేకుండా నిర్వహించే విధుల కారణంగా ఎంతోమంది పోలీసు అధికారులు ,సిబ్బంది వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన సమయానికి వైద్య పరీక్షలు నిర్వహించు కోకపో వడం వలన అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారని అన్నారు. అలాకాకుండా సంవత్సరంలో రెండుసార్లు పూర్తి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గూర్చి తెలుసుకుంటూ దానికి అనుగుణంగా వైద్య చికిత్సలు తీసుకుంటూ ఉండాలని సూచించారు. అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఏమీ చేయలేమని, మన ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా పరిరక్షించు కుంటూ ఉంటే జీవితంలో అన్ని సాధించినట్లేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఆర్‌ శ్రీహరిబాబు , ఏ ఆర్‌ అడిషనల్‌ ఎస్పి ఎస్‌ వి డి ప్రసాద్‌ , బందరు డిఎస్పి వై మాధవ రెడ్డి ,పోలీసు అధికారులు పాల్గొన్నారు.