* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : రక్తదానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని పాతబస్టాండ్ ఆవరణలో శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్టు ఆధ్వర్యాన నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. బరాటం సంతోష్ గురుస్వామి, శిష్య బృందం ఆధ్వర్యాన నిర్వహించిన శిబిరంలో 116 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణ త్యాగాలు, బలిదానాల వల్ల దేశ స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ సర్వజనాసుపత్రి, రెడ్‌క్రాస్ సొసైటీ, న్యూ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం, లయన్స్ ఇంటర్నేషనల్, జెమ్స్ హాస్పిటల్, సిఎస్‌వి బ్లడ్ బ్యాంకులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్‌పి జి.ఆర్ రాధిక, ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










