Mar 11,2023 00:12

అవగాహన శిబిరంలో పాల్గొన్న ఖాసీం, వినోద్‌బాలు, వెంకటరావు

ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని అయ్యన్న డిగ్రీ కాలేజీలో అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన రక్తదానంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అయ్యన్న డిగ్రీ కాలేజీ డైరెక్టర్‌ ఎస్‌కె.ఖాసీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రక్తదాన చైతన్యకర్త వినోద్‌ బాలు మాట్లాడుతూ రక్తదానం వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి ప్రాణదాతలు కావచ్చని తెలిపారు. అందువల్ల ప్రతి బ్లడ్‌ డోనర్‌ దేవుడితో సమానమన్నారు. ట్రస్టు చైర్మన్‌ గొంప వెంకటరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చని చెప్పారు. అమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యాన ఈ నెల 12వ తేదీన ఆదివారం మండలంలోని ఎ.కోడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నామని, ఆ శిబిరంలో రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న జూనియర్‌ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ జి.అప్పారావు, డిగ్రీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ ఎస్‌.రమణ, సిబ్బంది, 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు.