Feb 08,2023 23:38

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
రక్తదానంపై అపోహలు వద్దని ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, అల్లూరి జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ గంగరాజు అన్నారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశాల మేరకు స్థానిక వెలుగు కార్యాలయం వద్ద రెడ్‌ క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎంపీపీ గోము వెంకటలక్ష్మి తదితరులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం మంచిదేనని, దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. అత్యవసర సమయంలో అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. మన్యంలో ఎంతో మంది గర్భిణులు, బాలింతలు, గిరిజన బాలికలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వారికి సహృదయంతో దాతులు ఇచ్చే రక్తం వలన ప్రాణాలు నిలబెట్టవచ్చని తెలిపారు. ప్రమాదాల బారిన పడిన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కె బాపన్నదొర, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యఆచారి, వైసిపి జిల్లా నాయకులు దాట్ల వెంకటేష్‌రాజు, రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రి వైధ్యాధికారి లిఖిత, ఎంఈవో కె.తాతబ్బాయిదొర, వెలుగు ఎపియం ఆదినారాయణ, ఉపాధి హామీ ఎపివో సురేష్‌, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.