ప్రజాశక్తి - నూజివీడు
రక్త దానం చేయడంలో ముందుంటున్న మహోన్నత వ్యక్తి మహర్షి లయన్ పి.కృష్ణప్రసాద్ నేటి యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తన 57వ ఏట 57వసారి రక్తదానం చేయడం ఎంతో ఆనందం కలిగిస్తుందన్నారు. రక్తదానం పట్ల ప్రజలు అపోహలు వీడాలన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా జీవించే ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చని సూచించారు. నూజివీడు డిఎస్‌పి బి.శ్రీనివాసులు, నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.నరేంద్ర సింగ్, పట్టణ సిఐ మూర్తి, రూరల్ సిఐ ఆర్.అంకబాబు, రూరల్ ఎస్‌ఐ తలారి రామకృష్ణ, పట్టణ ఎస్‌ఐ వెంకటేష్, ట్రాఫిక్ ఎస్‌ఐ రాధాకృష్ణ, చాట్రాయి ఎస్‌ఐ ప్రతాపరెడ్డి, ముసునూరు ఎస్‌ఐ ఎం.కుటుంబరావు, ఆగిరిపల్లి ఎస్‌ఐ నంబూరి చంటిబాబు, మెడికల్ పోలీసు సిబ్బంది రక్తదాత కృష్ణ ప్రసాద్‌ను అభినందించారు.










