
రాజంపేట అర్బన్ : రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని రక్షించవచ్చునని డిసిహెచ్‌ఎస్ డాక్టర్ డేవిడ్ సాల్మన్ తెలిపారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ హెల్త్ మేళ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజంపేట ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం అన్ని దానాలలోకి మహాదానమని పేర్కొన్నారు. ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన దాతలు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. పిపి యూనిట్ కొరకు కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో వార్డు ఆపరేషన్ థియేటర్ కావాలని, ఏరియా ఆసుపత్రి నందు వీడియో కాన్ఫరెన్స్ గదిని ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డిని పోరాటం జరిగిందని తెలిపారు. వారి వినతుల పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం హెచ్‌ఒ చెన్నకష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరాజు, వైద్యులు శేఖర్, వికాస్, లక్ష్మీప్రసన్న, సౌజన్య, రాష్ట్ర సిహెచ్‌ఓఎస్ గౌరవ అధ్యక్షులు పిల్లి పిచ్చయ్య, టిబి సూపర్వైజర్ జయప్రకాష్, యుడిసి సిద్ధిరామయ్య, నీరజ పాల్గొన్నారు.