
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మనం చేసే రక్తదానం... ఆపద సమయంలో మరొకరి ప్రాణాలను నిలుపుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల నేపథ్యంలో స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణం నుంచి వాక్ ఫర్ విజయనగరం ర్యాలీని ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, బ్లడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ తాము జీవిస్తున్న ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని.. అప్పుడే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రక్తదానం చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయేమోనని చాలా మందికి అపోహ ఉందని, దీనిపై ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.
అమరావతి ఎగ్జిబిషన్ ప్రారంభం
నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్‌ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడపు విజయలక్ష్మి, ఎగ్జిబిషన్ అధినేత శ్రీనివాస్ రెడ్డి, గోల్డ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.