Jun 17,2023 00:39

రక్తదానం చేస్తున్న ఏపూరి గోపాలరావు, ఎస్‌.ఆంజనేయులు నాయక్‌

ప్రజాశక్తి - నరసరావుపేట :ప్రపంచ రక్తదాన వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని నిమ్మతోటలోని పల్నాడు బ్లడ్‌సెంటర్‌లో సిఐటియు, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని పల్నాడు జిల్లా సహాయ కార్మిక కమిషనర్‌ ధనలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌ అధ్యక్షత వహించగా సహాయ కార్మిక కమిషనర్‌ మాట్లాడుతూ శిబిరం నిర్వహణను అభినందించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ గుంటూరు విజరు కుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవాలు, వారోత్సవాలకు సంబంధం లేకుండా రక్తదాన కార్యక్రమం నిరంతర ప్రక్రియలా భావించాలని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేయాలని కోరారు. బ్లడ్‌ సెంటర్‌ నిర్వాహకులు కుర్రా జనకిరామయ్య మాట్లాడుతూ డయాలసిస్‌, వివిధ ఆపరేషన్‌లు, ప్రమాదాల సందర్భంలో రోగులను, క్షతగాత్రులను ప్రాణాపాయం నుండి కాపాడాలంటే ప్రతి ఒక్కరూ రక్త దానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం చేస్తే నీరసం వస్తుందని, ఏదో అవుతుందనే అపోహలను వీడాలని సూచించారు. రక్తదానం వల్ల శరీరంలో కొత్తగా రక్తం తయారవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌వలి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, సిఐటియు జిల్లా కోశాధికారి డి.శివకుమారి, సహాయ కార్యదర్శి జి.మల్లేశ్వరి, టి.శ్రీనివాసరావు, బి.మహేష్‌, శ్రీనివాసరావు, సిలార్‌ మసూద్‌, ఇ.మస్తాన్‌రెడ్డి, ఎం.రంగారావు, ఆంజనేయరాజు, కె.సాయికుమార్‌ పాల్గొన్నారు.