ప్రజాశక్తి-సబ్బవరం : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా సిఐ పి..రంగనాధం మాట్లాడుతూ, వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శిబిరంలో 50మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. వారోత్సవాలలో భాగంగా సబ్బవరం జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించామని, విద్యార్థులతో ర్యాలీ చేపట్టామన్నారు. రక్తదాన శిబిరానికి సామాజిక కార్యకర్తలు సింగంపల్లి వెంకటరావు, కె. శ్రీనివాసవర్మ, అసకపల్లి సర్పంచ్ కర్రి నర్సింగరావు తదితరులు సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ బ్లడ్‌బ్యాంక్ డాక్టర్ జి. బాలకృష్ణ, ఎస్‌ఐ ఎల్.సురేష్, పోలీసులు, వైద్య సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.










