ప్రజాశక్తి - చింతలపూడి
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించి జిల్లాను రక్త హీనత రహిత జిల్లాగా మార్చేందుకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కృతనిశ్చయంతో ఉన్నారని సచివాలయ సమాచార విభాగం జిల్లా సమన్వయకర్త టిఎన్.స్నేహన్ అన్నారు. సోమవారం మండలంలోని మూడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రెచర్ల, ఎర్రగుంటపల్లి గ్రామాల సచివాలయాలు సందర్శించారు. సచివాలయ ఉద్యోగులతో సమావేశమై పలుఅంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు అంకితబావంతో పనిచేయాలన్నారు. జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న వారి కోసం కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారని చెప్పారు. జిఒ 132 ప్రకారం సచివాలయ ఉద్యోగులకు సూచించిన మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ఇళ్ల వద్ద కిశోరబాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు జరపాలన్నారు. ఎంతమందికి పరీక్షలు నిర్వహించారో వివరాలు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. గర్భిణులు, బాలింతల విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తం తక్కువగా ఉన్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని చెప్పారు. బాల్యవివాహాలు జరగకుండా చూడాలని సూచించారు. యగుంటపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బాలికలకు 'రక్త హీనత - బాల్య వివాహాల నిర్మూలన' అంశంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహమనే రక్కసి కోరల్లో బాలికలు చిక్కుకోవద్దని సూచించారు. బాల్య వివాహం చేస్తే చట్ట ప్రకారం రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారని చెప్పారు. 112 టోల్ ఫ్రీ నెంబర్‌కు బాల్య వివాహాల సమాచారం అందించాలన్నారు. అనంతరం యర్రగుంటపల్లిలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాబూరావు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు










