రక్తదానంపై రెండు జిల్లాలో పెరుగుతున్న అవగాహన
పెద్దఎత్తున ముందుకు వస్తున్న యువత
జిల్లాలో ఏడాదికి పదివేల యూనిట్ల రక్తం అవసరం
తలసేమీయా, రక్తహీనత రోగులకు నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాల్సిందే
ప్రసవాలు, ఆపరేషన్ల సమయంలో ఆదుకుంటున్న దాతలు
నెగిటివ్ బ్లడ్ గ్రూపుల రక్తనిల్వలో కొంత ఇబ్బంది
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
'ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో గైనిక్ సమస్యతో ఆపరేషన్ చేయించుకునేందుకు లింగపాలెం మండలానికి చెందిన వెంకటలక్ష్మి చేరింది. ఆపరేషన్ చేసేందుకు బ్లడ్ అవసరమని డాక్టర్లు తెలిపారు. ఆమెది 'ఎ' నెగిటివ్ బ్లడ్. బ్లడ్‌బ్యాంకుల్లో ఆ గ్రూప్ రక్తం నిల్వలు లేకపోవడంతో ఏం చేయాలో అర్ధంకాలేదు. వెంటనే తెలిసినవారికి చెప్పడంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ పోస్టు చూసి ఏలూరుకు చెందిన యువకుడు ఫోన్ చేసి వెంటనే రక్తదానం చేసి వెళ్లడంతో వెంకటలక్ష్మికి సకాలంలో డాక్టర్లు ఆపరేషన్ చేయగలిగారు.'
'కామవరపుకోట మండలానికి చెందిన ఓ యువతి గుండె ఆపరేషన్ చేయించుకునేందుకు ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. 'ఒ' పాజిటివ్ బ్లడ్ అత్యవసరమని డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకుని ఆ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వచ్చి రక్త దానం చేశారు. దీంతో ఆపరేషన్ జరిగి ఆ యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది.'
ప్రాణప్రాయ స్థితిలో ఉన్నవారికి రక్తం ఇస్తున్న ఎంతోమంది దాతలు ఆయా కుటుంబాలకు రక్తబంధువులుగా మారి మరిచిపోలేని గుర్తులను మిగులుస్తున్నారు. రక్తందానంపై పెరుగుతున్న అవగాహన ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతోంది. ఒకప్పుడు రక్తదానం చేసేందుకు భయపడేవారు. దీంతో సకాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి సైతం ఉండేది. నేడు అలాంటి పరిస్థితి నుంచి బయటపడుతున్నట్లు బ్లడ్‌బ్లాంకుల్లోని రక్త నిల్వలతోపాటు, సోషల్‌మీడియాలో పోస్టులకు స్పందించి వచ్చి రక్తదానం చేస్తున్న ఉదంతాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 వరకూ బ్లడ్‌బ్యాంకులున్నాయి. ఏలూరులో రెడ్‌క్రాస్, ప్రభుత్వాసుపత్రిలో బ్లడ్‌బ్యాంకు రోగులకు రక్తం సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదేవిధంగా తణకు, భీమవరం, జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతాల్లోనూ బ్లడ్ బ్యాంకులు క్రీయశీలకంగా పనిచేస్తున్నాయి. ప్రతీరోజు ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు, సర్జరీలు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన రోగులకు రక్తం అత్యవసరం అవుతోంది. నెలకు కనీసంగా 800 నుంచి వెయ్యి యూనిట్ల వరకూ రక్తం రోగులకు అవసరం పడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 175 మంది తలసేమియా, వందమందికిపైగా చికెన్‌సెల్ రోగులున్నారు. వీరికి నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కొంతమందికి నెలకు మూడుసార్లు సైతం రక్తం ఎక్కించాలి. గతంలో ఇలాంటి రోగులకు రక్తం ఎక్కించాలంటే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వేలకువేలు పోసి రక్తం కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు కొనుగోలు చేసేందుకు సైతం రక్తం దొరికన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి. రెడ్‌క్రాస్, ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకుల్లో తలసేమీయా, చికెన్‌సెల్ రోగులకు ఇబ్బంది లేకుండా రక్తం అందిస్తున్నారు. జిల్లాలో అవసరానికి సరిపడు రక్త నిల్వలుంటున్నాయి. గతంలో ఈపరిస్థితి ఉండేదికాదు. రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రక్తం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో యువత పెద్దఎత్తున ముందుకు వచ్చి రక్తం దానం చేస్తున్నారు. ఇదివరకూ యువకులు మాత్రమే రక్తదానం చేసేవారు. ఇప్పుడు కాలేజీల్లో చదువుతున్న యువతులు సైతం రక్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. రక్తదానం చేసేవారిలో 15 నుంచి 20శాతం మంది అమ్మాయిలు ఉండటం విశేషం.
కార్యక్రమాల్లో రక్తదాన శిభిరాలు
గతంలో సినిమా హీరోలు, నాయకుల పుట్టిన రోజులు జరిగినప్పుడు కటౌట్‌లు వంటివి కట్టి అభిమానులు సంబరాలు చేసుకునేవారు. కానీ పరిస్థితిలో మార్పు వచ్చింది. సినిమాహీరోల ఫ్యాన్స్ తమ హీరోల పుట్టినరోజులకు రక్తదానాలు చేస్తున్నారు. నాయకులకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ కార్యకర్తలు ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో యువజన సంఘాలు సైతం రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. పోలీసు అమరవీరుల దినోత్సవం వంటి కార్యక్రమాల సమయంలో పోలీసులు పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏడాదికి జిల్లాలో పదివేల యూనిట్ల వరకూ రక్తం దాతలనుంచి వస్తోంది. 350 ఎంఎల్ రక్తం ఉన్న ప్యాకెట్‌ను ఒక్క యూనిట్‌గా పరిగణిస్తారు. 18 ఏళ్లు నిండి, 45 కిలోల బరువు పైన ఉన్నవారు మూడునెలలకు ఒకసారి ఏడాదికి నాలుగుసార్లు రక్తం ఇవ్వొచ్చు. రక్తం తీయడం, ఎక్కించడం వచ్చిన వారికి మాత్రమే బ్లడ్‌బ్యాంకు నిర్వహణ లైసెన్సులు ఇస్తారు. రక్త సేకరణ సమయంలో ఐదు రకాలైన ఎయిడ్స్, మలేరియి వంటి పరీక్షలు నిర్వహించి మంచి రక్తాన్ని మాత్రమే సేకరించి రోగులకు అందిస్తారు. బ్లడ్‌బ్యాంకుల్లో ప్రస్తుతానికి సరిపడు నిల్వలు ఉంటున్నప్పటికీ నెగిటివ్ గ్రూప్‌కు సంబంధించిన రక్తం విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బంది ఉంటుంది. రక్తదానంపై మరింత అవగాహన పెరిగితే ఈ సమస్యను కూడా అధిగమించొచ్చనని అధికారులు చెబుతున్నారు. రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సి ఉంది.










