కుండపోత వర్షాలకు రక్షణ గోడ నేలమట్టం
పునరావాస కేంద్రానికి ఐదు కుటుంబాల తరలింపు
ఇసుక బస్తాలతో కూలిన గోడ వద్ద తాత్కాలిక రక్షణ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జెడ్‌సి, ఇంజినీరింగ్ అధికార్లు
ప్రజాశక్తి -తగరపువలస : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రెండో వార్డు సత్యనారాయణపేట కొండవాలు ప్రాంతంలో గురువారం రాత్రి రక్షణగోడ హఠాత్తుగా కుప్పకూలింది. కూలిన రక్షణ గోడను ఆనుకుని ఉన్న కొల్లూరి శ్రీను, మాదాబత్తుల నాగేశ్వర రావు, జగన్నాధం, పైడిరాజు, శ్రీను కుటుంబాలు భయాందోళనలకు గురై, రాత్రికిరాత్రే ఇళ్లను వదిలి, కట్టుబట్టలతో సమీపాన ఉన్న సామాజిక భవనంలో తలదాచుకున్నారు. సమాచారం తెలుసుకున్న జీవిఎంసి, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వసతి, భోజన సదుపాయం కల్పించారు. విఆర్‌ఒ రంభ, విఆర్‌ఎ సంపూర్ణ పునరావాస కేంద్రంలో బాధితులకు అవసరమైన ఏర్పాట్లు సమకూరుస్తున్నారు.
అరకొర రక్షణ గోడ వల్లే ప్రమాదం
హుదూద్ సమయంలో కూడా ఇదేచోట మట్టిపెళ్ళలు విరిగిపడడంతో, ఘటన జరిగిన చోట అప్పట్లో పాక్షికంగా రక్షణ గోడ నిర్మించారు.వాస్తవానికి రోడ్డుకు అవతల, ఇవతల ఉన్న ఇళ్లను అనుకుని పూర్తిస్థాయిలో అప్పట్లోనే రక్షణ గోడ నిర్మించి ఉంటే ఈ తరహా ప్రమాదాలు జరిగి ఉండేవి కావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిధుల లభ్యతను బట్టి అప్పట్లో అరకొరగా రక్షణగోడ నిర్మించడం, తర్వాత దీన్ని పట్టించుకోకపోవడమే ప్రస్తుత ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
కారణాల అన్వేషణలో అధికారులు..
ఏనిమిదేళ్ల క్రితం నిర్మించిన రక్షణగోడ ప్రస్తుత వర్షాలకు కూలిపోవడానికి కారణాలను అన్వేషించే పనిలో జివిఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు పడ్డారు. నాణ్యతా లోపమా? లేకుంటే స్థానికులు అంటున్నట్లు అరకొరగా నిర్మించడం వల్ల ప్రమాదం జరిగిందా? లేక ప్రస్తుతం అక్కడే రైతుబజారు భవనాలను నిర్మిస్తున్న క్రమంలో వాటి పునాదుల కోసం తీసిన గోతుల వల్ల మట్టి జారిపడి, తర్వాత వర్షాలు కురవడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందా? అనే అనేక అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
కూలిన స్థలాన్ని అధికారులు, నేతల పరిశీలన
కొండవాలు ప్రాంతంలో రక్షణగోడ కూలిన ప్రాంతాన్ని శుక్రవారం జెడ్‌సి ఎన్.వెంకటరమణ, తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్, డిఇఇ మణికుమార్, ఎఇఇ ఎ.సుమన్ తదితరులు పరిశీలించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, పలువురు రెండో వార్డు వైసిపి నేతలు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు.
నాలుగు నెలల్లో రెండోసారి...
సత్యనారాయణపేట కొండవాలు ప్రాంతంలో ప్రస్తుతం ప్రమాదం జరిగిన వరుసలోనే, సిమెంట్ రోడ్డుకు అవతల, పాత మీసేవా కేంద్రం సమీపంలో ఈ ఏడాది మే 26న మట్టి పెళ్లలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది. ఇపుడు రక్షణగోడ కూలడంపై స్థానికులు అందోళన చెందుతున్నారు. అయితే రెండు ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశం. మరో ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని తగు చర్యలు చేపట్టాలని కొండవాలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
ఎత్తుగా రక్షణ గోడ నిర్మించాలి
రక్షణ గోడ నిర్మాణం ఎత్తుగా, పటిష్టవంతంగా చేపట్టాలి. ఎప్పుడు వర్షం కురిసినా కంటి మీద కునుకు ఉండటం లేదు. కట్టుబట్టలతో పునరావాస కేంద్రానికి వచ్చాం. అధికారులు స్పందించి, పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలి.
మాదాబత్తుల లక్ష్మి
బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం...
కొండవాలు ప్రాంతంలో ఉంటున్న సరైన రక్షణగోడ లేకపోవడంతో చిరుజల్లులు కురిసినా హడలి చస్తున్నాం. ఈ ప్రాంతంలోనే కొద్దిరోజుల వ్యవధిలో వరుస రెండు ఘటనలతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.
ఆర్ లక్ష్మి










