Jun 20,2021 11:58

నాన్నెప్పుడూ నీ వెనుకే ఉంటాడు
నీ వెన్నుకు దన్నై ఉంటాడు
నీ అడుగులు తడబడినప్పుడు
రక్షణ కవచమై నీ వెనుకే ఉంటాడు
నీ అడుగు జాడలకు నీడలా
తన కళ్ళని కాపలా పెడతాడు
నీ అలకలు తీర్చడానికి
తన ఎముకల్ని అరగదీస్తాడు
పుస్తకాలతో నువ్వు కుస్తీ పడుతుంటే
తాను పస్తుల పరమాన్నం వండుతాడు
ప్రయోజకుడై నువ్వు పదవుల్లో ఉంటే
వాడు నా కొడుకేనని గర్వపడకుండా
తాను నీ తండ్రినని చెప్పుకుంటూ
తనని తాను వెనక్కి నెట్టుకుంటాడు
నీకెప్పుడూ తాను భారం కాకూడదని
తన బలానికి నగిషీలద్దుతాడు
నీ ఉన్నతికి తన త్యాగం కన్నా
నీ ప్రతిభకే పట్టాభిషేకం చేస్తాడు
అంతెందుకు....
తల కొరివి పెట్టినప్పుడు
నువ్వు వెనుతిరిగి చూడకున్నా
నాన్న నిర్జీవమై నీ వెనుకే ఉంటాడు
నీ వెన్నుకు దన్నై ఉంటాడు.
 

- యం యస్‌ రాజు
95020 32666