ప్రజాశక్తి-విజయవాడ
రక్షణ గోడ నిర్మాణం పేరుతో పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు దశాబ్దాల తరబడి ఉంటున్న ఏ ఒక్క ఇంటిని తొలగించినా స్థానిక ప్రజలను కలుపుకొని ఆందోళన చేయాల్సి వస్తోందని, ఇళ్లను తొలగించకుండా సత్వరమే గోడ నిర్మాణ పనులను ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు డిమాండ్ చేశారు. ఇళ్లను తొలగించకుండానే రక్షణ గోడ నిర్మాణ పనులను చేపట్టాలని కృష్ణలంక 21వ డివిజన్ కోదండరామ ఘాట్ వద్ద రణదివెనగర్ ప్రజలను కలుపుకొని సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. రక్షణ గోడ నిర్మాణం పేరుతో ఇళ్లను తొలగించవద్దని, గోడ నిర్మాణ విషయాలను స్థానిక ప్రజలకు వెల్లడించాలని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమానుద్దేశించి బాబూరావు మాట్లాడుతూ కృష్ణానది వరద ముంపు నివారణకు కృష్ణలంక 21వ డివిజన్ పద్మావతి ఘాట్ నుంచి 20వ డివిజన్ వారధి వరకు రక్షణ గోడ నిర్మాణపు పనులను ప్రభుత్వం చేపట్టడం మంచి పరిణామమన్నారు. అయితే రక్షణ గోడ నిర్మాణం పేరుతో రణదివెనగర్ కరకట్ట దిగువన దశాబ్దాల తరబడి నివాసముంటున్న వందలాది పేద కుటుంబాలను తొలగించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. వరదల సమయములో స్థానిక ప్రజలు అన్ని రకాలుగా నష్టపోతున్నందున, దాని నివారణకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలే గానీ, ప్రజలను ఇక్కడ నుంచి తొలగించి, రక్షణ గోడ నిర్మాణం చేపడతామంటే, ఆ గోడ ఎందుకు ప్రయోజనమని ప్రశ్నించారు. రాజకీయక్షపక్షాలతో కూడా అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, ఇక్కడ జరుగుతున్న పనుల తీరు వీటిపై సమగ్రంగా పారదర్శకంగా చర్చించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు దోనేపూడ కాశీనాద్ మాట్లాడుతూ రాణిగారితోట తారకరామానగర్ వద్ద జరిగిన రిటైనింగ్ వాల్ నిర్మాణం సమయములో అడ్డున్నాయని 150 ఇళ్లు తొలగిస్తామని చెప్పిన అధికారులు ఏకంగా 420 గృహాలను తొలగించారని, అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకపోగా, చేసుకోవడానికి పని కూడా లేకుండా చేశారని, అదే పరిస్థితి ఇక్కడ తలెత్తితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీసభ్యులు పి కృష్ణ, నాయకులు కోరాడ రమణ, తాడి రమణ, లక్ష్మీనారాయణ, శ్రీరాములు, గోపి, కుమార్, ఎ లక్ష్మణకుమార్, ఎన్ పద్మా, ఎం సరోజనమ్మ, సిహెచ్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
కరకట్టపై ప్రదర్శన : ధర్నా అనంతరం స్థానిక నివాసులతో కలిసి ప్రదర్శనగా వెళ్లి నదిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగే ప్రాంతాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. అధికారుల వైఖరిని స్థానిక ప్రజలు నాయకులకు వివరించారు. తమకు ఎటువంటి సమాచారం చెప్పకుండానే గోడ నిర్మాణం పేరుతో నదిలో జెండాలు పాతారని, తమ ఇళ్లు పోతాయేమోనని ప్రజలు నాయకుల ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోడ నిర్మాణానికి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పోరాడామని, ఇళ్లను కూడా కాపాడుకోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని, అందుకు సిపిఎం అండగా ఉంటుందని సిపిఎం నేతలు భరోసానిచ్చారు.










