'రక్షణ' భటులు 'కరువు'
4 లక్షల మంది
జనాభాకు 450మందే
సగం మంది ప్రోటోకాల్ డ్యూటీలోనే..
పోస్టుల భర్తీకి నోచని పోలీసు శాఖ
ప్రజాశక్తి-తిరుపతి సిటి
రక్షకభటులు. 24×7 వీరు విధుల్లో ఉండాల్సిందే.. ఆకలి, నిద్ర టైం టు టైం ఉండదు.. ప్రోటోకాల్ డ్యూటీ అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లే వరకూ వెనకంటే ఉండాలి. ఇక ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అయితే నిర్బంధాలు సరేసరి.. ప్రతిపక్ష నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చిన వెంటనే పోలీసులు వెళ్లి వారి ఇళ్ల ముందు వాలిపోవాల్సిందే. ఆ పిలుపు పూర్తయ్యేంత వరకూ ఆ నాయకుడు గృహ నిర్బంధంలో ఉండేలా చూసుకోవాల్సిందే. ఆందోళనలు సక్సెస్ కాకుండా చూడాల్సిందే.
సమాజానికి రక్షణ, ప్రజలకు భద్రత, చట్టాన్ని కాపాడడం, నేరాలను రూపుమాపడం వీరి ప్రధాన విధి. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ముందుండే వ్యక్తులు వీరు. మహిళలు, పిల్లలు, వృద్దులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు అందరికి మేమున్నామనే భరోసా ఇచ్చే బాధ్యులు. కానీ ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుపతి నగరంలో వీరి జాడ అంతంత మాత్రమే. మూడున్నర లక్షల మంది నగర వాసులకు కేవలం 450 మంది పోలీసులే దిక్కు. వీరిలోనూ సగానికిపైగా ప్రొటోకాల్ విధులకే పరిమితం అవుతుండడంతో అటు నేరాలను, ఇటు ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారుతుంది. పైగా ఖాళీ పోస్టులు, అదనపు పోస్టులు భర్తీకి ఉన్నతాధికారులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.
తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వేలాది మంది యాత్రికులు నగరానికి వస్తుంటారు. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న తిరుపతి ఇప్పడు నగర పాలక సంస్థగా విస్తరించింది. ఇటు రేణిగుంట, తిరుచానూరు, అటు చంద్రగిరి వరకు నగర పరిధి పెరిగింది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మూడున్నర లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. వీరికి తోడు ప్రతి రోజూ లక్ష మంది యాత్రికులు బయట ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. అదనంగా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల నుంచి, సమీప జిల్లాల నుంచి వైద్యసేవల కోసం, విద్య, కోసం, వ్యాపారం కోసం, వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు, జిల్లా అధికార యంత్రాగాన్ని కలిసేందుకు సుమారు 50వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అంటే ప్రతి రోజూ ఎంతలేదన్నా 5 లక్షల మందికిపైగా జనాభా తిరుపతిలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత మంది జనాభాకు రక్షణ కల్పించడం, ఇంత పెద్ద నగరంలో ప్రతి మూల మూలన భద్రతను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించడం, నిత్యం వచ్చే లక్షలాది వాహనాలను అదుపు చేసి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం కత్తిమీద సాములాంటిది. ఇంత పెద్ద నగరంలో నేరనియంత్రణకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు కేవలం 450 మంది లోపే పోలీసు సిబ్బంది (అధికారులతో కలిపి) ఉండడం గమనార్హం. అందులోనే తిరుపతి, తిరుమలకు వచ్చే ప్రముఖులకు ప్రొటోకాల్ విధుల నిమిత్తం సగానికిపైగా సిబ్బందిని కేటాయిండచంతో 150 నుంచి 200 మంది సిబ్బంది వరకు నగరం మొత్తం విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. తిరుపతిలో ఈస్టు పోలీసు స్టేషన్, అలిపిరి, వెస్టు పోలీసు స్టేషన్, ఎస్‌వియు క్యాంపస్, తిరుపతి రూరల్ (ఎంఆర్‌పల్లి) పోలీసు స్టేషన్‌తో పాటు ట్రాఫిక్, క్రైమ్ పోలీసు స్టేషన్‌లు ఉన్నాయి. తిరుపతి నగరంలో 50 డివిజన్లలో 3 లక్షలకు పైగా జనాభా నివశిస్తున్నారు. నగరంలో 7 విశ్వవిద్యాలయాలు, జిల్లాకలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయం, వందలాది డిగ్రీ, పిజి, ఇంటర్ కళాశాలలకు వేలాది ప్రయివేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రముఖ ఆలయాలు, వీటన్నిటికి అరాకొర సిబ్బంది దిక్కు. వీరిలోనూ కొంత మంది సిబ్బంది వివిధ కేసుల దర్యాప్తు నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అరాకొర సిబ్బందితో పెరుగుతున్న వాహనాల తాకిడిని తట్టుకుని ట్రాఫిక్‌ను నియంత్రించడం ఒక సవాలే. అదనపు సిబ్బంది నియామకానికి ఉన్నతాధికారులు దృష్టిపెట్టకపోవడంతో పోలీసు సిబ్బందికి అదనపు విధులు, పనిఒత్తిడి తప్పడం లేదు. ఇక నైనా జిల్లా అధికారులు స్పందించి పోలీసు సిబ్బందిని పెంచి, అదనపు పోస్టులను భర్తీ చేసి, నగర వాసులకు రక్షణ పెంచాలని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు.










