Jul 25,2021 12:41

జైపూర్‌ : పంజాబ్‌లో ఏర్పడ్డ అంతర్గత విబేధాలను పరిష్కరించిన కాంగ్రెస్‌..ఇప్పుడు రాజస్తాన్‌ వైపు దృష్టి సారించింది. పంజాబ్‌లో అసమ్మతి తెలిపిన సిద్దుకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అప్పగించి ...ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మధ్య మళ్లీ స్నేహ గీతిక ఆలపించేలా చేసింది. ఇప్పుడు రాజస్తాన్‌లోనూ రాజీ కుదుర్చేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరు కావాలని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోస్తారా పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్‌ మధ్య గత కొన్ని నెలలుగా విభేదాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ కూడా ఉండవచ్చునని సమాచారం. ఈ మేరకు అధిష్టానంలోని వర్గీయులు కూడా శనివారం జైపూర్‌కు చేరుకున్నారు. కెసి వేణుగోపాల్‌, అజయ్ మకేన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతక ముందు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
ఇటు సచిన్‌ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలు గత ఏడాది నుండి గహ్లోత్‌ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ సమావేశానికి సంబంధించి కొన్ని సంకేతాలిచ్చారు. తాను లేవనెత్తిన సమస్యల గురించి పార్టీ హైకమాండ్‌తో చర్చించానని, వీటిని పరిష్కరించే అవకాశాలున్నాయని పైలట్‌ చెప్పారు. గత నెలలో పైలట్‌ క్యాంప్‌లో ఎమ్మెల్యేలు...సచిన్‌కు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, కేబినేట్‌ విస్తరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.