ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ :రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని గణేష్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయి ఆరామంలో జిల్లా రజక సంఘం తొలి మహాసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాశయ్య మాట్లాడుతూ చాలా రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నారన్నారు. ఎపిలో కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని చాలా ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. షెడ్యూల్ జాబితాలో చేర్చితే గ్రామాల్లో దాడులు, బహిష్కరణలు ఉండవని, రజకుల పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రజక పేద విద్యార్థులకు సంఘం అండగా ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అవుతున్నా రజకులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త జిల్లాలో తొలి మహాసభ నిర్వహిస్తున్నమన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, రాష్ట్ర కార్యదర్శి తేలిక ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాపనపల్లి శివప్ప, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ రజకుల కోసం నిర్మించిన దోభి ఘాట్లు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, 50 ఏళ్లు నిండిన రజకులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రిస్వామి, ప్రొద్దుటూరు వెంకటేశు, కోగిర సువర్ణ, రామచంద్ర, నారాయణప్ప, కనుముక్కల లక్ష్మన్న, జిల్లా నలుమూలల నుంచి రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










