Aug 27,2023 21:12

రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య
ప్రజాశక్తి - భీమవరం
రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక మెంటేవారితోట ప్రజాసంఘాల కార్యాలయంలో ఆదివారం రజక వృత్తిదారుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రజకులు ఉన్నారన్నారు. రాష్ట్ర జనాభాలో రజకులు ఐదు శాతం ఉన్నారని పేర్కొన్నారు. నూటికి 50 శాతం మంది రజకవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. నేటికీ సమాజంలో కులం పేరుతో దూషిస్తూ రజకులపై దాడులు అత్యాచారాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దాడులు అరికట్టేందుకు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ మాదిరిగా ఒక సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలో రజక వృత్తి కోసం కేటాయించిన వందలాది చెరువులపై పెత్తందారుల కన్నుపడి అనేక గ్రామాల్లో చెరువులు రజకులకు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అయినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులు భర్తీ చేసి రజక యువతి యువకులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి రజక కుటుంబానికీ రజక కార్పొరేషన్‌ ద్వారా 90 శాతం సబ్సిడీతో రెండు లక్షల రూపాయల రుణాలిచ్చి పెద్ద గ్రామాల్లో, పట్టణ కేంద్రాల్లో మోడ్రన్‌ దోబీ గాడ్స్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మడకా రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, వద్దిపర్తి శ్రీనివాస్‌ మాజీ జిల్లా కార్యదర్శి, యండమూరి వెంకట సుబ్బారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.