రాయచోటి : పలువురు ధరించే వస్త్రాలను తెల్లగా ఉతికి, ఇస్త్రీ చేసి వారిని పది మందిలో హుందాగా కన్పించేలా చేసేవారు రజకులు. కానీ ఏళ్లు గడుస్తున్నా అందరి మురికి బట్టలను తెల్లబడేలా శుభ్రం చేస్తున్నా వారి జీవితాలు మాత్రం నేటికీ నేటికీ తెలబడడం లేదు. అన్నమయ్య జిల్లావ్యాప్తంగా దాదాపు 30 వేల మంది రజకులున్నారు. వీరిలో దాదాపు 12,000 మంది రజక వత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏటిలో, చెరువులో నీళ్లు లేకపోవడంతో బట్టలు ఉతకడానికి రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రజకులకు దోబీ ఘాటు ఏర్పాటు చేసి వారికి ఆదరణ పథకం కింద ఇస్త్రీ పెట్టెలు, ఇనుప అండాలు, తోపుడు బండ్లు ఇచ్చేది. దోబీఘాట్ల వద్ద బోరు మోటారు ఏర్పాటు చేసి మంచి నీటిలోని బట్టలు ఉతుకొని అక్కడే ఆరబెట్టుకునేందుకు స్థలం కూడా కేటాయించారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో బోర్లు ఎండిపోయి. ఉన్న మోటర్లు చెడిపోవడం వల్ల నీరు లేక దోబీ ఘాట్లన్నీ ముళ్ళపదలతో నిండికున్నాయి. చెడిపోయిన మోటార్లు తయారు చేసేందుకు పంచాయతీ వారి వద్ద నిధులు లేకపోవడంతో తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో దోబీఘాట్లు నేడు నిరుపయోగంగా మారిపోయాయి. చెడిపోయిన బోర్లు మోటార్లను తయారు చేయించాలంటూ సర్పంచ్లను కోరగా వారు ప్రభుత్వమే పంచాయతీలో ఉన్న డబ్బులు అన్ని లాక్కున్నారని తమ వద్ద ఎలాంటి నిధులు లేవని తెలిపారు. కనీసం వీధిలైట్లు పోయిన పారిశుధ్య పనులు చేపట్టాలన్న నిధులు లేవని సర్పంచ్లు చెబుతున్నట్లు రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దోబిఘాట్లు ఆక్రమానికి గురవుతున్నాయని వాపోయారు. ఎన్నికల సమయంలో నాయకులు తమ వద్దకు వచ్చి తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే మీకు ఇల్లు, ఇళ్ల స్థలాలు దోబీ ఘాట్లు ఇస్తామంటూ చెప్పి ఎన్నికల తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్టలు ఉతకడానికి నీటి సదుపాయం లేకపోవడంతో 2,3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అక్కడికి వెళ్లేందుకు గతంలో అయితే గాడిదలు ఉండేవని, వాటిపై మూటలు వేసుకొని వెళ్లి ఉతికి ఆరబెట్టుకుని తిరిగి రైతులకు ఇచ్చేవాళ్ళమన్నారు. ప్రస్తుతం గాడిదలు లేవు తాము మోయలేక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొన్ని చోట్ల నీళ్లు ఉన్నప్పటికీ ఆ నీటిలో గంటల తరబడి నుంచి బట్టలు ఉతకడం వల్ల కాళ్లు పేలిపోవడం చేతులు తెల్లబడిపోయి వంకరలు కావడం కీళ్ల జబ్బులు వస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో అనారోగ్యం గురైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసేవారని , ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రిలో తెల్ల కార్డు చూపితే ఉచిత వైద్య సేవలు కూడా అందడం లేదన్నా తెలిపారు. చాలామంది కాళ్లు వంకర్లు పోవడం, చేతులు పేలిపోవడం, నడుములు, భుజాల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతునందని చెప్పారు. ఇస్త్రీ చేయాలన్న బొగ్గులు దొరకడం లేదని పేర్కొన్నారు. బొగ్గులు మూటలు కొని వాటి చేత ఇస్త్రీ చేయాలంటే ఆర్థిక భారం అధికమైందని తెలిపారు. ఓ ప్యాంటు, చొక్కా ఇస్త్రీ చేస్తే కేవలం రూ.10 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వాపోతున్నారు. .రాష్ట్ర ప్రభుత్వం రజకుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. బ్యాంకుల ద్వారా రజకులకు రుణాలు మంజూరు చేసి ఇస్త్రీ పెట్టెలు, తోపుడు పండ్లు, గంగాళాలు వంటి వాటిని సబ్సిడీతో అందించాలని, రజకులకు రాజకీయ, సామాజిక అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించి, కార్డులు ఇతర పరికరాలు చేయాలని పలువురు రజకలు కోరుతున్నారు .
సౌకర్యాలు కల్పించాలి
దోబి ఘాటు వద్ద విద్యుత్ సౌకర్యం, షెడ్లు, తాగునీరు వంటి సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. బట్టలు ఉతికి , ఇస్త్రీ చేయడం వల్ల నడుములు, కీళ్లు, ఇతర అనారోగ్య సమస్యలొస్తున్నాయి. పని చేస్తేనే పూట గడుస్తుంది. గతంలో మాదిరిగా బట్టలు కూడా ఎక్కువగా రావడం లేదు. రజక వత్తి చేసే వారికి ప్రభుత్వం పెన్షన్, ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేయాలి.
-శ్రీనివాసులు, రజకుడు, రాయచోటి.
ప్రభుత్వం ఆదుకోవాలి
జిల్లా వ్యాప్తంగా రజక వత్తి చేసే వారందరికీ వాషింగ్ మిషన్, విద్యుత్ ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు, ఉచిత విద్యుత్ సదుపాయాలను వంటి సదుపాయాలను ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రి, ఆలయ లలో బట్టలు ఉతికే పనిని రజకులకు అప్పజెప్పాలి. రజక వత్తి చేసే చేసే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కార్డులు,పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి.
- టి . రమేష్ బాబు, రజక సంఘం జిల్లా అధ్యక్షులు, రాయచోటి. అన్నమయ్య జిల్లా.










