
ప్రజాశక్తి-విజయనగరం రూరల్, బొండపల్లి : జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో పరీక్షల అనంతరం అవసరమైన వారిని తదుపరి చికిత్సలకు నెట్‌వర్కు ఆసుపత్రులకు రిఫర్ చేయడమే కాకుండా, వారు పూర్తిగా వైద్య చికిత్స పొందేవరకు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. వారందరికీ ఆరోగ్యశ్రీ పథకం క్రింద మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాద్యత వైద్యాధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. బొండపల్లి మండలం బి.రాజేరు, విజయనగరం మండలం గొల్లలపేటలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్, కౌంటర్లు, వైద్యసేవలు, ఇస్తున్న మందులు, నిర్వహిస్తున్న పరీక్షలు, రిఫరల్ కేసులపై ఆరా తీశారు. శిబిరానికి హాజరైన రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నవంబరు 15 నాటికి జిల్లా అంతటా ఆరోగ్య శిబిరాల నిర్వహణ పూర్తి అవుతుందన్నారు. ఒక గ్రామంలో శిబిరం పూర్తి అయిన వెంటనే రిఫరల్ కేసులపై పూర్తిగా దృష్టి పెట్టి, వారికి తదుపరి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిబిరాల్లోనే ఆరోగ్యశ్రీపై పూర్తిస్థాయిలో రోగులకు అవగాహన కల్పించి, వారు నెట్‌వర్కు ఆసుపత్రులకు వెళ్లేవిధంగా చూడాలన్నారు. సుగర్, బిపి లాంటి వ్యాధులు బయటపడితే, వారి ఆరోగ్యాన్ని ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. అటువంటి రోగులకు నెలనెలా ఉచితంగా మందులను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమాల్లో డిఎంహెచ్‌ఒ డాక్టర్ భాస్కరరావు, బొండపల్లి ఎంపిడిఒ రాజేంద్రప్రసాద్, ఇన్‌ఛార్జి తాహశీల్దార్ శంకర్రావు, విజయనగరం ఎంపిడిఓ జి.వెంకటరావు, డిటి కోటేశ్వర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.
2,600 ఎకరాల్లో పంట నష్టం
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా, ఇప్పటివరకు సుమారుగా 2,600 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బి.రాజేరులో విలేకర్లతో మాట్లాడుతూ, జిల్లాలో వర్షాభావ పరిస్థితిని వివరించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యిందని చెప్పారు. తాజాగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, ఈ నెలాఖరులోగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ వ్యవసాయశాఖ సిబ్బంది, గ్రామ వ్యవసాయ కార్యదర్శులు నిరంతరం పంటలను పర్యవేక్షిస్తూ, ఎండిన పంటలను నమోదు చేస్తున్నారని తెలిపారు. కాలువల ఆయుకట్టు భూములకైనా సక్రమంగా నీరు అందించి, పంటలకు కాపాడుకునేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.