Jul 28,2021 16:56

కిశ్త్వార్‌: జమ్మూకాశ్మీర్‌లోని కిశ్త్వార్‌ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా వచ్చిన వరదలకు హోంజార్‌ గ్రామంలో ఏడుగురు మృతి చెందగా.. దాదాపు 30 మంది ఆచూకీ గల్లంతయిందని అధికారులు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. అత్యవసర పరిస్థితుల్లో వైమానిక దళం సేవలు కూడా ఉపయోగించుకోనున్నట్లు కేంద్రమంత్రి జితేందసింగ్‌ వెల్లడించారు. అలాగే అక్కడ వాతావరణ పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్‌షా.. ఘటనాస్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ఎప్పటివకప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. అధికారులతో సమీక్షిస్తున్నారని మోడీ వెల్లడించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
గత కొద్దిరోజులుగా జమ్మూలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల చివరి వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పు ఉన్న ప్రాంతవాసులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.