ప్రజాశక్తి -భీమునిపట్నం : రింగు వలల వాడకం వల్ల సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోనుందని జిల్లా మత్య శాఖ సంయుక్త సంచాలకులు జి.విజయ స్పష్టంచేశారు. జివిఎంసి నాలుగో వార్డు పరిధి మంగమారిపేట సామాజిక భవనం వద్ద గురువారం మత్స్య, పోలీసు శాఖ సంయుక్తంగా రింగు వలల నిషేధంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. విశాఖ తీరంలో రింగు వలల వినియోగంపై కోర్టు నిషేధం విధించినందున, అందుకు అనుగుణంగా రింగువలలు వాడ రాదని చెప్పారు. కోర్టు ఆదేశాలను అతిక్రమించరాదన్నారు. డిఎస్‌పి కాళిదాసు మాట్లాడుతూ, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రింగు వలలు వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయకృష్ణ, ఎఫ్‌డిఒ డి.లావణ్య, భీమిలి సిఐలు కె.లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, ఎస్‌ఐలు మురళీకృష్ణ, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.










