
ప్రజాశక్తి- కోటవురట్ల:గొట్టివాడ శివారు అణుకు గ్రామానికి రహదారి, పాఠశాల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు సిపిఎం ఆధ్వర్యంలో అనుకు గ్రామానికి వెళ్లే దారిలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ, గిరిజన గ్రామమైన అణుకు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం, పాఠశాల లేక పోవడంతో 50 కుటుంబాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. శాసనసభ్యులు గొల్ల బాబురావు , జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల పరిషత్, తహసిల్దార్ కార్యాలయాల్లో అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడంతో నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ, గ్రామానికి సరైన రోడ్డు, పాఠశాల, మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నారని ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు మొర పెట్టుకున్నా పట్టించు కోలేదన్నారు. అణుకు గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాల నుంచి తిరిగి వస్తు దీక్షశిబిరం వద్ద బైఠాయించారు. పాఠశాల, రోడ్డు సౌకర్యం కల్పించాలని నినాదాలు చేశారు. అధికారులు, నాయకులు ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చి నిధులు మంజూరు చేసే వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డేవిడ్‌రాజు, గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు.