ప్రజాశక్తి-పాడేరు:ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ ముందు నిర్వహిస్తున్నరిలే నిరాహార దీక్షలు ఆదివారం 14వ రోజు న్యూ ఇయర్ నాడు కూడా కొనసాగాయి. ఈ దీక్షలను ఉద్దేశించి ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కూడ రాధాకృష్ణ, ఐక్య వేదిక కో కన్వీనర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం స్పందిం చేంత వరకు ఉద్యమం ఆపేది లేదని, వెంటనే జోక్యం చేసుకొని, గిరిజన విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు తక్షణమే హెల్త్ అసిస్టెంట్‌లను ఆశ్రమాల్లో నియమించాలని, గిరిజన ఆశ్రమ విద్యార్థులు మరణాలు అరికట్టేందుకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులు రెండు నెలల కాలంలోనే ఆరుగురు విద్యార్థులు మరణించినా అధికారులకు, ప్రభుత్వానికి చలనం లేదన్నారు. పాడేరు ఐటీడీఏ పిఓను తక్షణమే సరెండర్ చేయాలని, పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవోను రక్షించడం కోసం అమాయక ఉద్యోగులను బలి చేయడం సరికాదని, వారి సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని కోరారు. ప్రజా సంఘాల ప్రతినిధులను గిరిజన విద్యాసంస్థల్లోకి ప్రవేశాన్ని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల వేదిక కోకన్వీనర్లు మువ్వాళ లక్ష్మణరావు, చిన్నారావు, కాదేలి చంటిబాబు, బత్తిరి నరేష్, పి.లోకేష్ పాల్గొన్నారు.










