May 18,2023 20:09

మన గ్రోమోర్‌ దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎడిఎ సునీత

ప్రజాశక్తి - దేవనకొండ
సీడ్స్‌, పెస్టిసైడ్స్‌ ఎరువుల దుకాణాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆలూరు ఎడిఎ సునీత, పత్తికొండ ఎడిఎ మోహన్‌ విజరు కుమార్‌ హెచ్చరించారు. గురువారం దేవనకొండలో ఎఒ సురేష్‌ బాబు ఆధ్వర్యంలో సీడ్స్‌, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. మన గ్రోమోర్‌ సెంటర్‌ ఎరువుల దుకాణంలో సీడ్స్‌ రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రూ.5.65 లక్షల విలువ చేసే పత్తి విత్తనాల అమ్మకాల నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి రైతుకూ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని, డీలర్స్‌ టూ డీలర్స్‌ విత్తనాలు అమ్మకూడదని సూచించారు. రైతులు ఎవరూ లూజు విత్తనాలు కొనుగోలు చేయకూడదన్నారు. విత్తనాలు కొన్న రసీదు, ప్యాకెట్‌ పంట చివరి వరకు దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. ఎవరైనా లూజు విత్తనాలు అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎఇఒ జయరాం, యోగి, రంగన్న పాల్గొన్నారు. ఆలూరు పట్టణంలోని ఎరువుల దుకాణాలను పత్తికొండ, ఆలూరు ఎడిఎలు విజయ మోహన్‌, సునీత తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఎఒ వెంకటేశ్వర గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.