ఐటిటిఎ పిఒ సూరజ్ గనోరే హెచ్చరిక
ప్రజాశక్తి-మారేడుమిల్లి
ఏజెన్సీలోని గ్రామ సచివాలయాలలో రికార్డులు పక్కాగా నిర్వహించాలని, లేనియెడల తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే హెచ్చరించారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ అధికారి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గుర్తేడు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని పరిశీలించి, ఎంతమంది సిబ్బంది ఉన్నది, ఏఏ రికార్డులు నిర్వహించుచున్నది పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులు సక్రమంగా నిర్వహించినందుకు ప్రాజెక్ట్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రిజిస్టర్లు పరిశీలించారు. ఈ ఎగువ ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లేకుండా సంబంధిత మందులు అందజేయాలని సూచించారు. తరువాత పులోవ గ్రామానికి సంబంధించిన సుమారు రెండు కిలోమీటర్ల సీసీ రోడ్డు పనులను ప్రాజెక్ట్ అధికారి పరిశీలించారు. గ్రామంలోని గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నది లేనిదీ అడిగి తెలుసుకున్నారు. జి.వట్టిగడ్డ గ్రామానికి సంబంధించిన సుమారు రెండు కిలోమీటర్ల డబ్ల్యూబిఎం రోడ్డును పిఒ పరిశీలించారు. ఈ రెండు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సిహెచ్.శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, గుర్తేడు సర్పంచ్ దుష్యంతుడు, అస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యంవివి సత్యనారాయణ. శివరాం చందు, మండల విద్యాశాఖ అధికారి తాతబ్బాయి దొర, ఉపాధి హామీ పథకం ఏపీవో స్వామి తదితరులు పాల్గొన్నారు.










