Aug 25,2023 21:31

ఏపీఓ లక్ష్మణ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పిడి జి జోసెఫ్‌ కుమార్‌

ప్రజాశక్తి-ఈపూరు : ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో ఏపీవో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల డ్వామా పీడీ జి.జోసెఫ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎస్‌ఆర్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2022-23కు సంబంధించి 515 ఉపాధి హామీ, నిర్మాణ పనులకు రూ.5,86,29,171 ఖర్చు చేశామని చెప్పారు. డీఆర్పీలు ఆయా గ్రామ పంచాయతీలలో సామాజిక తనిఖీలలో గుర్తించిన అంశాలను ప్రజా వేదికలో చదివి వినిపించారు. పనుల వివరాలను రికార్డులలో నమోదు చేయడంలో నిర్లక్ష్యాన్ని గుర్తించిన పీడీ వారం రోజుల్లో ఆయా వివరా లను రికార్డులలో నమోదు చేయకుంటే జరిమానా వేస్తా మని హెచ్చరించారు. కొచ్చర్లలో ఇద్దరు, ఊడిజెర్లలో రైతు లు తైవాన్‌ జామ తోట సాగు చేసినట్లు రికార్డులో ఉండగా ఆ ప్రదేశంలో తోటలు లేవన్నారు. క్షేత్రస్థాయిలో తోటల సాగుపై పరిశీలించాలని ఏపీడి ఈవూరి బూసిరెడ్డిని ఆదేశించారు. ఎ.ముప్పాళ్ల సచివాలయ భవన నిర్మాణానికి రూ.45 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండంగా అదనంగా పంచాయతీ ఖాతాకు రూ.27 వేలు జమ చేయడంపై వీఆర్‌ఏ ముత్తినేని శ్రీనివాసరావును ప్రశ్నించారు. వనికుంట, ఊడిజర్ల గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిలో లేనప్పుడు వారిని ఎందుకు తొలగించలేదని, కొత్తవారి నియామకం కోసం ప్రతిపాదనలు ఎందుకు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం రూ.33 వేలు రికవరీకి ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఏవి రంగనాయకులు, జెడ్‌పిటిసి టి.చౌడయ్య, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ విజయకుమారి, ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.