ప్రజాశక్తి- అనకాపల్లి
రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోతే ఉపేక్షించేది లేదని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ యు హరి ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తుదారులకు సమాచారం పంపాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన ఆర్‌టిఐ చట్టం 4(1) (బి) తాజాపరచి వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో 28 ప్రభుత్వ శాఖలను ఆకస్మిక పరిశీలన చేయగా రిజిస్టర్లు సంతృప్తికరంగా లేవన్నారు. త్వరలో ఆర్టిఐ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడం జరుగుతుందని, దీనివల్ల దరఖాస్తుదారునికి, అధికారులకు కాలం, ధనం ఆదా అవుతుందని చెప్పారు. విచారణకు హాజరుకాని పిఐఓలు తమ ప్రతినిధులుగా పూర్తి సమాచారం తెలిసిన వారిని పంపాలన్నారు. జాతీయస్థాయి అధ్యయనంలో సమాచార కమిషన్ల పనితీరు విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉందన్నారు. అనంతరం ఆయన నూకంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు శ్రీరామ్మూర్తి, సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ పాల్గొన్నారు.










