
దేశంలో ఒకవైపున రిజర్వేషన్ల వలన కలుగుతున్న ప్రయోజనాలు తగ్గిపోతూంటే, మరోవైపున తమకూ రిజర్వేషన్లు కావాలన్న తాపత్రయం మరిన్ని తరగతులలో పెరుగుతోంది. స్వతంత్ర భారతదేశంలో గత ఏడు దశాబ్దాలుగా అమలు జరిగిన రిజర్వేషన్ల వలన వచ్చిన అనుభవాలను, ఫలితాలను దిగువ పేర్కొన్న విధంగా సంక్షిప్తీకరించవచ్చు.
( నిన్నటి సంచిక తరువాయి )
7. రిజర్వేషన్ల వలన ప్రయోజనం పొందిన కొద్దిమంది విద్యావంతులుగా, ఉన్నత తరగతిగా, మధ్యతరగతిగా ఎదిగిన తర్వాత తమ తమ సామాజిక తరగతులకు చెందిన అత్యధికుల ఉద్ధరణ కోసం కృషి చేయడం లేదు. తమ ప్రమోషన్ల కోసం, తమ కుటుంబాల అభ్యున్నతి కోసం మాత్రమే వారిలో అత్యథికులు తాపత్రయపడుతున్నారు. వారి ప్రయోజనాలకు అస్థిత్వ రాజకీయాలు బాగా అక్కరకు వస్తున్నాయి. అందుకే వాళ్ళు బలపరిచే సంస్థలు, వాళ్ళు నిర్వహించే ఆందోళనలు, ఉద్యమాలు రిజర్వేషన్ల సమస్యకు, ప్రాతినిధ్యాలకు మాత్రమే పరిమితమౌతున్నాయి. రాజకీయంగా, సామాజికంగా వారి వరకు పైకి ఎదగడానికి ఒక మెట్టుగా, పాలక వర్గాలతో బేరసారాలకు ఒక సాధనంగా ఈ రాజకీయాలను పరిమితం చేసుకుంటున్నారు. దీని వలన ఈ తరగతులలో నుండి ఒక చిన్న భాగాన్ని పాలక వర్గాలు తమలో కలుపుకుని, తద్వారా ఈ వెనకబడిన సామాజిక తరగతుల్లో పాలక వర్గాల ప్రభావాన్ని పెంచుకుంటున్నాయి.
8. ప్రజా బాహుళ్యాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఒక వ్యూహాత్మక సాధనంగా కూడా రిజర్వేషన్లను పాలక వర్గాలు ఉపయోగించుకుంటున్నాయి. తమ ఓటు బ్యాంకు మరింత పదిలం చేసుకోడానికి, లేదా వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి, లేదా ప్రజల దృష్టిని వారి భౌతిక సమస్యల వైపు నుండి పక్కకు మళ్ళించడానికి ఉపయోగకరంగా ఉంటుందనుకున్నప్పుడు రిజర్వేషన్ల డిమాండ్లను, వాటి కోసం జరిపే సమీకరణలను పాలక వర్గాలు ప్రోత్సహిస్తున్నాయి. కుల విభజనలు నిరంతరం కొనసాగడానికి ఒక సాధనంగా రిజర్వేషన్ సమస్యను, కులం మీద ఆధారపడిన అస్థిత్వ రాజకీయాలను బూర్జువా పార్టీలు ఉపయోగించుకుంటాయి.
9. వాటి స్వభావ రీత్యానే రిజర్వేషన్లు సాంఘిక సమానత్వాన్ని గాని, సామాజిక న్యాయాన్ని గాని సాధించగల ఒక విధానంగా ఉండజాలవు. కాని రిజర్వేషన్ల ద్వారా క్రమంగా బలహీన వర్గాలు ప్రస్తుత వ్యవస్థ పరిధి లోపలే తమ సాంఘిక అసమానతల నుండి బైటపడగలవన్న భ్రమలను సృష్టించడంలో భారత పాలక వర్గాలు జయప్రదం కాగలిగాయి. ఈ భ్రమలను ఉపయోగించుకుని బలహీన వర్గాల ప్రజా బాహుళ్యానికి వైద్యం, విద్య, ఉద్యోగాలు, భూమి తదితర సంపదలు కల్పించాల్సిన తన ప్రాథమిక బాధ్యత నుండి రాజ్యం పక్కకి తప్పుకుంది.
- ముగింపు
భారత పాలక వర్గాలు సామాజిక న్యాయం పేరుతో చేపట్టిన రిజర్వేషన్లు, ఇతర విధానాలు స్వతంత్ర భారత దేశంలో ఉన్న ప్రస్తుత కుల వ్యవస్థలో ఒక వైరుధ్య భరిత క్రమానికి తెర తీశాయి.
కుల, సామాజిక సమూహాల సాంప్రదాయ ప్రాతిపదికను పాక్షికంగా కరిగించడానికి తోడ్పడడంతో బాటు సామాజిక అస్థిత్వాలు ఒక కొత్త ప్రాతిపదికన గట్టిపడేందుకు కూడా దోహదం చేశాయి.
ఇంతవరకూ సాపేక్షంగా ఒకే తీరున ఉండిన కులాల్లో, సామాజిక సమూహాల్లో అసమానతలకు వర్గ విభజనలకు రిజర్వేషన్లు దారి తీశాయి. ఒక కులం వారంతా ఒకే రకమైన పరిస్థితుల్లో ఉండి సాంప్రదాయంగా ఐక్యంగా ఒక కట్టుబాటుతో ఉండే పరిస్థితిని మార్చి, ఆ కట్టుబాటును సడలించేందుకు దోహద పడుతూనే, అదే సమయంలో ఈ విధానాల ఫలితంగా ఏర్పడిన ఒక కొత్త ఉన్నత తరగతి పట్టు పెరిగేందుకు తోడ్పడుతున్నాయి.
ఇంతవరకూ పక్కకు నెట్టబడిన సమూహాల నుండి కొంతమందిని చేర్చుకోవడం ద్వారా సాపేక్షంగా ఒకే తీరుగా ఉన్న సామాజిక వర్గాలను భిన్నమైన సమూహాలుగా మార్చడానికి, సాంఘిక అసమానతల ప్రాతిపదికన ఏర్పడిన వర్గాలలో వైవిధ్యాన్ని ప్రవేశ పెట్టడానికి రిజర్వేషన్లు దారి తీశాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా కుల వ్యవస్థను మార్చడానికి, లేదా సర్దుబాటు చేయడానికి తోడ్పడేదే ఈ వైరుధ్యభరిత ప్రక్రియ. తద్వారా ఆ యా సామాజిక సమూహాలపై పాలక వర్గాల పట్టు మరింత పెరుగుతుంది. అందుచేత కుల వ్యవస్థ నిర్మూలన కోసం జరిగే పోరాటం ఇప్పుడు మరింతగా పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయడానికి జరిపే పోరాటంతో కలగలిసిపోయింది.
మొత్తంగా చూసుకుంటే, అణచివేయబడే సామాజిక తరగతులను ప్రేరేపించడానికి రిజర్వేషన్ల ప్రభావం తోడ్పడినంతగా వారికి వాస్తవ భౌతిక ప్రయోజనాలను కలిగించలేదు. ఇక పెట్టుబడిదారీ సంబంధాలను నిరంతరం కొనసాగించడానికి, పునరుత్పత్తికి పాలక వర్గాలకు తోడ్పడే ఒక శాంతియుత సాధనంగా రిజర్వేషన్లు తోడ్పడుతున్నాయి. ఈ రిజర్వేషన్ ప్రక్రియ అమలు లోని వైరుధ్య భరిత స్వభావం వర్గ ఐక్యతను నిర్మించే కృషిలో కొత్త సంక్లిష్టతలను విప్లవోద్యమం ముందు ఉంచుతోంది.
- / వ్యాసకర్త సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు/