Sep 03,2023 22:39

ఫొటో : మాట్లాడుతున్న రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు

రిజర్వేషన్‌ కౌంటర్‌ తీసేయడం దారుణం
ప్రజాశక్తి-బిట్రగుంట : బిట్రగుంట రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ను తీసివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధి షేక్‌ నూరుద్దీన్‌ అన్నారు. బిట్రగుంటలో ఉన్న బుకింగ్‌ ఆఫీసు రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ను ప్రయివేటుపరం చేయడానికి వ్యతిరేకిస్తూ బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సమావేశాన్ని బోగోలు బజారు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రతినిధి షేక్‌ నూరుద్దీన్‌ మాట్లాడుతూ బిట్రగుంట రైల్వే పరంగా ఎంతో పేరుగాంచిన బిట్రగుంట రైల్వే స్టేషన్లో ఉన్న సదుపాయాలను ముఖ్యంగా బుకింగ్‌ ఆఫీసును ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టి రిజర్వేషన్‌ కౌంటర్‌ను ఎత్తివేసే నిర్ణయాన్ని మానుకోవాలన్నారు. లేనిపక్షంలో బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 8వ తేదీ శుక్రవారం బోగోలు నుండి రైల్వే బిట్రగుంట రైల్వే స్టేషన్‌ వరకు నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
ఈ సందర్భంగా బోగోలు మండల సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకయ్య, మండల సిఐటియు కార్యదర్శి చల్ల నరహరి, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ సాగర్‌, తదితరులు మాట్లాడుతూ బిట్రగుంట ఖ్యాతిని క్రమంగా రైల్వే శాఖ తగ్గిస్తూ ఇక్కడ ఉన్న సౌకర్యాలు తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైల్వే స్టేషన్‌లో కరోనా ముందు ఆగే రైళ్లను హాల్టింగ్‌ ఎత్తివేసే విషయాన్ని ప్రస్తావించారు. ఈ విధంగా రైల్వే శాఖ బిట్రగుంట స్థాయిని తగ్గిస్తూ భవిష్యత్తులో బిట్రగుంట రైల్వేను భూస్థాపితం చేసే విధంగా కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ఇప్పటికైనా స్పందించి వ్యాపారస్తులు, మహిళలు, విద్యార్థులు రోజువారి సీజనేర్స్‌, రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగస్తులు అందరూ శుక్రవారం జరిగే నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు మాలిపాటి నాగేశ్వరరావు, బత్తుల రవిచంద్ర దాసరి సునీల్‌ శ్యామ్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాసులు, వాకర్స్‌ సత్యనారాయణ చార్యులు, మానవ హక్కుల పరిరక్షణ సమితి ఒంగోలు జిల్లా అధ్యక్షులు దాసరి సునీల్‌, తదితరులు పాల్గొన్నారు.