Nov 13,2023 21:50

రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం

* నేటి నుంచి కార్డు ప్రైమ్‌ 2.0 అమలు
* నూతన రిజిస్ట్రేషన్‌ విధానంతో మధ్యవర్తులకు చెల్లుచీటీ
* ఆన్‌లైన్‌లో డాక్యుమెంటేషన్‌
భూముల రిజిస్ట్రేషన్‌ అంటే పెద్ద ప్రహసనమే. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఏ పనీ ముందుకు సాగదు. ఇక అటువంటి కష్టాలకు ప్రభుత్వం చెక్‌ పెడుతోంది. రిజిస్ట్రేషన్‌ సేవలను సులభతరం చేసేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చింది. కార్డ్‌ ప్రైమ్‌ 2.0 ద్వారా వినియోగదారులకు కచ్చితత్వంతో కూడిన లావాదేవీలతో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా ఉండనుంది. మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రజలు సులువుగా రిజిస్ట్రేషన్లు చేసుకునేలా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. వినియోగదారులే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్‌ తయారు చేసుకునే ఈ విధానంలో 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది.
    ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో రోజంతా పడిగాపులు కాయాల్సి వచ్చేది. డాక్యుమెంట్‌ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయం, పర్యవేక్షణలో డాక్యుమెంట్‌ తయారీ, చలానా కట్టడం, స్లాట్‌ బుకింగ్‌ వంటివన్నీ జరిగేవి. చలానా నిర్దేశించిన బ్యాంకు పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రోజునే చెల్లించాల్సి వచ్చేది. చలానాతో పాటు సంబంధిత పత్రాలను పూర్తి చేసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంటు రైటర్లు అందజేస్తే, సబ్‌ రిజిస్ట్రార్‌ సమక్షంలో రిజిస్ట్రేషన్‌ జరిగేది. ఇదో పెద్ద ప్రహసనంగా క్రయ, విక్రయదారులు భావించేవారు. ఇక్కడా పెద్దఎత్తున నగదు చేతులు మారేది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత దస్తావేజులు చేతికి రావాలంటే నాలుగు రోజుల సమయం పట్టేది. వందేళ్ల నాటి రికార్డులు సైతం రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉండడం వల్ల లోపాలను గుర్తించేందుకు వీలుండేది.
కొత్త విధానం ఎలా ఉంటుందంటే...
రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రయ విక్రయ విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. గతంలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం, ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టింది. కొన్ని కారణాల రీత్యా దీన్ని పట్టాలెక్కించడం సాధ్యం కాలేదు. తాజాగా ప్రభుత్వం కార్డ్‌ ప్రైమ్‌ 2.0 విధానాన్ని తీసుకొచ్చింది. తక్కువ సమయంలో సులభంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఈ విధానంలో వీలవుతుంది. డాక్యుమెంటు రైటర్లతో పని లేకుండా వినియోగదారులే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్‌ తయారు చేసుకోవచ్చు. ఆస్తి వివరాలు, పేరు, ఆధార్‌, సాక్షులు వంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేస్తే వెంటనే ఆస్తి మార్కెట్‌ విలువ, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీలు ఎంత కట్టాలో చూపిస్తుంది. ఆ సొమ్మును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఆఫ్లైన్‌, స్టాక్‌ హోల్డింగ్‌ ద్వారా కూడా చలానా కట్టే అవకాశముంది. అనంతరం రిజిస్ట్రేషన్‌ టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకుని, ఆ సమయానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లు, వివరాల ఆధారంగానే పరిశీలిస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఈ-సిగేచర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. భూములకు సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలు ఆన్‌లైన్‌లో జత చేయడం వల్ల 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. తదనంతరం డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా పొందవచ్చు.
నేటి నుంచి అమలు
జిల్లాలో కార్డు ప్రైమ్‌ 2.0 విధానం ఈనెల 14వ తేదీ నుంచి అమలు కానుంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్‌ కోసం క్రయ, విక్రయదారులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన పని ఉండదు. ఆన్‌లైన్‌లో సక్రమంగా డాక్యుమెంట్‌ ఉంటే రిజిస్ట్రేషన్‌కు ఆటంకం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరినీ ఆశ్రయించాల్సిన, అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- కూన మన్మథరావు, జిల్లా రిజిస్ట్రార్‌