Mar 03,2023 21:24

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

రీసర్వేను పకడ్బందీగా చేపట్టండి
7లోగా ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయండి
జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం కింద రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టి రెవెన్యూ రికార్డుల మేరకు నాణ్యతతో భూ వివాదాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌ అన్ని మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో పిఓఎల్‌ఆర్‌ రీ సర్వే, ఎమ్మెల్సీ ఎన్నికలు, భూసేకరణ, ఇళ్ల పట్టాలు, కోర్టు కేసుల సత్వర పరిష్కారం తదితర రెవిన్యూ అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతితో కలిసి కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పిఒఎల్‌ఆర్‌ కింద చేపట్టిన సర్వేలో నాణ్యత ప్రమాణాలు పాటించి రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా పకడ్బందీగా చేపట్టాలన్నారు. నిర్దేశిత సమయంలోగా సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. బనగానపల్లి, కోవెలకుంట్ల, గోస్పాడు, చాగలమర్రి, నందికొట్కూరు తదితర అన్ని మండలాలు పిఓఎల్‌ఆర్‌ సర్వే పెండింగులో వుందని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వెబ్‌ ల్యాండ్‌, ఆర్‌ఒఆర్‌లో ఉన్న భూముల విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూముల విస్తీర్ణానికి తేడాలున్నట్లు పత్రికల్లో ప్రతికూల వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో నిశితంగా పరిశీలించి సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7వ తేదీ సాయంత్రంలోగా ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ పుల్లయ్య, నంద్యాల, డోన్‌, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకట్‌ రెడ్డి, ఎం.దాసు, అన్ని మండలాల తహశీల్దార్లు, కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.