Jun 24,2023 21:24

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : సెప్టెంబర్‌ మాసాంతంలోగా జిల్లాలో గ్రామాల్లో చేపట్టిన రెండో దశ రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికా రులను ఆదేశించారు. శనివారం సిఎస్‌ కార్యాలయం నుంచి స్పెషల్‌ సిఎస్‌, సిసిఎల్‌ఎ సాయి ప్రసాద్‌ వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి రెండవ దశ భూహక్కు, రీ సర్వే, ప్రాధాన్యత భవనాలు, జగనన్నకు చెబుదాం అంశాలపై కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించి ఆయా అంశాలలో ప్రగతి సాధనకు దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుంచి కలెక్టర్‌, జెసి ఫర్మన్‌అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ హాజరయ్యారు. విసి ముగిసిన అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ రెండవ దశ రీ సర్వే పకడ్బందీగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన దశల వారి ప్రక్రియలను ఆయా కాలపరిమితిలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్‌ ట్రుతింగ్‌, వెక్టోరైజేషన్‌, విలేజ్‌ సెక్రటరీ, విఆర్‌ఒ, తహశీల్దార్‌, ఆర్‌డిఒ, జెసి లాగిన్‌లలో డేటా ఎంట్రీ పక్కాగా జరగాలన్నారు. ఎప్పటికప్పుడూ డేటా ఎంట్రీని రోజూ పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో డ్రోన్‌ సర్వే చేశారు, ఎన్ని పూర్తి చేశారు, ఇంకనూ చేయాల్సిన గ్రామాలు ఎన్ని తదితరాలలో నివేదిక సమర్పించాలన్నారు. గ్రౌండ్‌ ట్రుతింగ్‌లో భాగంగా రెవెన్యూ రికార్డుల మేరకు ప్రభుత్వ భూములను, పట్టా భూములను పక్కగా రీ సర్వే చేయాలన్నారు. మొదటి దశ రీసర్వేలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని రెండవ దశను పటిష్టంగా పూర్తి చేయాలన్నారు. రీసర్వేలో భాగంగా ల్యాండ్‌ కన్వర్షన్‌, ఆధార్‌ సీడింగ్‌, ఫొటోలు మిస్‌ మ్యాచ్‌ అంశాలలో తగు జాగ్రత్త వహించాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో హద్దురాళ్లు నాటే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్స్‌, రైతు భరోసా కేంద్రాల్లో ప్రణాళిక మేరకు పురోగతి సాధించి ఆగస్టు మాసాంతంలోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సిమెంట్‌ కొరత లేకుండా చూసుకోవాలని, ఉపాధి హామీ ద్వారా మెటీరియల్‌ పేమెంట్స్‌ ఎప్పటికప్పుడూ చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలలో చేపట్టిన పనుల వారీగా, దశల వారీగా, భవనం వారీగా సాధించిన ప్రగతిపై నివేదిక సమర్పించాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన ఆర్థికేతర వినతులు సంతప్తి స్థాయి పెంచేలా నాణ్యతతో సత్వరం పరిష్కరించాలన్నారు. ఆర్థిక అంశంతో ముడిపడిన వాటిని ఆయా కాలపరిమితి గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభమైందని వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు, అర్హత ఉండి ఇంకా అందని ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకొని సచివాలయం వద్ద సంబంధిత అంశంపై టోకెన్‌ వచ్చేలా ఏర్పాటుచేసి ప్రజలకు పథకాల లబ్ది అందేలా కషి చేయాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులందరూ సమన్వయంగా కషి చేయాలన్నారు. సమీక్షలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.