Mar 15,2023 23:46

సచివాలంలో పరిశీలిస్తున్న బాపట్ల కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రజాశక్తి - కారంచేడు : జగనన్న భూరక్ష రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయ కృష్ణన్‌ తెలిపారు. కారంచేడు మండలంలో కలెక్టర్‌ బుధవారం విస్తతంగా పర్యటించారు. ఈయ సందర్భంగా రీసర్వే ప్రక్రియ, గ్రామ సచివాలయం, హోమియోపతి వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగనన్న భూరక్ష రీ సర్వేలో భాగంగా మండల పరిధిలోని కేశవరప్పాడు గ్రామంలో హద్దురాళ్ల ఏర్పాటు ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే ప్రక్రియ ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. కేశవరపాడు గ్రామంలో 869.7 ఎకరాల భూములు ఉండగా సర్వే అనంతరం 895 హద్దురాళ్ళు వేయాల్సి ఉందన్నారు. రైతు గడ్డం శ్రీలత కు చెందిన 2.40 ఎకరాల భూమిలో మిర్చి పంట సాగు చేస్తుండగా, సర్వే పూర్తికాగానే హద్దురాళ్ళు వేయడాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మిర్చి పంట సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్‌ మాట్లాడారు. శాటిలైట్‌ ఆధారంగా భూముల హద్దులు నిర్ణయించే ప్రక్రియ, హద్దురాళ్లు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. సిబ్బంది పలు సూచనలు చేశారు.
సచివాయంలో తనిఖీ
పంచాయతీల ఆదాయ వనరులను మరింతగా పెంచుకోవాలని కలెక్టర్‌ విజయకష్ణన్‌ తెలిపారు. స్వర్ణ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, ప్రభుత్వ సేవలకు చెందిన వివిధ దస్త్రాలను పరిశీలించారు. పంచాయతీ అభివద్ధి పనులపై ప్రతిపాదనలు, తీర్మానాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. నిధుల రాబడి, వినియోగం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్తి పన్నులు త్వరగా వసూలు చేయాలన్నారు. గతేడాది రూ.72 లక్షల నిధులు పంచాయతీకి విడుదలైనప్పటికీ అభివద్ధి పనులు చేపట్టక పోవడంపై కలెక్టర్‌ ఆరా తీశారు.
హోమియో వైద్యశాలలో తనిఖీ
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ తెలిపారు. స్థానిక హోమియో వైద్యశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వైద్యశాలలోని మందులను పరిశీలించారు. రెండేళ్ల క్రితం కాలం చెల్లిన మందులు ఉండటం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చిన రోగాలకు ఎలాంటి మందులు ఇస్తున్నారని ఆరా తీశారు. కాలం చెల్లిన మందులు తక్షణమే పారవేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యమ్రంలో సర్వే ల్యాండ్స్‌ రికార్డ్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, తహశీల్దారు వెంకటరత్నం, ఎంపిడిఒ రమేష్‌ బాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.