Oct 21,2023 20:11

అధికారులపై ఆగ్రహిస్తున్న రైతులు

ప్రజాశక్తి-ఆలూరు
రైతుల పంట పొలాల రీసర్వే చేసిన ఫారం-46ను రైతులకు అందజేసిన వాటిలో తమ భూములు తక్కువ చూపిస్తున్నారని రైతులు అధికారులపై ఆగ్రహించారు. గతనెల రోజులుగా రైతుల పొలాలను రీసర్వే చేసి ఈనెల 1న రైతులకు అభ్యంతరాలపై శనివారం నోటీసులు ఇచ్చారు. ఆర్‌డిఒ మోహన్‌ దాసు, తహశీల్దార్‌ రామాంజనేయులు కురవల్లి గ్రామ రైతులతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన ఫారం-46 నోటీసులో అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని తెలపడంతో రైతులు ఒక్కసారి అధికారులపై ఆగ్రహించారు. తాత, ముత్తాతల నుంచి వచ్చిన భూములను తక్కువ చూపుతూ, రూ.లక్షలు పోసి కొన్నప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు సెంట్లు, ఎకరాల్లో తేడా చూపుతూ రైతులను ప్రభుత్వం, అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భూములు తక్కువ చూపిస్తే ఒప్పుకుంటారా అని మండిపడ్డారు. గ్రామాల్లో రైతులు కలిసిమెలిసి ఉన్న చోట రీసర్వే చేసి కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ చూపి గొడవలు పెడుతున్నారని పేర్కొన్నారు. తమకు ఏ సర్వే వద్దని, కాదు కూడదని అధికారులు రికార్డులు మార్చితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. సర్వేయర్‌ అరుణ జ్యోతి, విఆర్‌ఒ బ్రహ్మానందం పాల్గొన్నారు.