'రీసెర్చి ఫెలోషిప్' అమలు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ప్రజాశక్తి - క్యాంపస్‌శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు పరిశోధన చేస్తున్న ఫెలోషిప్ లేని పరిశోధక విద్యార్థులకు యూనివర్శిటీ రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ వెనుకబడిన బడిన రాయలసీమ ప్రాంతంలోని ప్రతిష్టాత్మకమైన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు పరిశోధన చేస్తున్న ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులు అనేక మంది పరిశోధన భతి లేకపోవడం తో కనీసం మెస్ లకు వెళ్ళి భోజనం చేయడానికి సాహసించక అర్థాకలితో తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే రాష్ట్రంలో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ఫెలోషిప్ లేని విద్యార్థులకు యూనివర్శిటీ రీసెర్చ్ ఫెలోషిప్ పథకం కింద నెలకు 5వేలు పరిశోధక భతి ఇస్తున్నారని తెలిపారు. వీసీ స్పందిస్తూ పాలకమండలి సమావేశంలో చర్చించి పథకం అమలు అయ్యేలా తన వంతు బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు అక్బర్, అశోక్, తేజ, నాయకులు శివ, వెంకటేష్, భరత్, విజరు తదితరులు ఉన్నారు.
వీసీకి వినతిపత్రం ఇస్తూ...










