
మోడీ ప్రభుత్వం పరిశోధక విద్యార్థులను పరిశోధన నుండి దూరం చేసే చర్యలకు పాల్పడుతోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి ఫెలోషిప్‌లను క్రమేణా తగ్గిస్తూ వస్తున్నది. గడిచిన నాలుగేళ్ల కాలన్ని పరిశీలిస్తే 50 శాతం మేర తగ్గించిందనే వాస్తవం తేటతెల్లమవుతుంది. 2016లో 9,503 విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్‌లు వస్తే 2021 నాటికి 3,986 ఫెలోషిప్‌లకు కుదించారు. మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ 2016లో 4,141 విద్యార్థులకు ఇస్తే నేడు 2,343కి తగ్గించారు. వీటితో పాటు పోస్టు డాక్టరల్ ఫెలోషిప్ (పిడిఎఫ్) 2016లో ఉన్న 554 నుండి నేడు 332 మాత్రమే ఇచ్చారు. దీనితో పాటు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎస్ రాధాకష్ణ పేరు మీద ఇచ్చే ఫెలోషిప్‌లు కూడా భారీగా తగ్గించారు. గతంలో యూజీసీ మెరిట్ విద్యార్థుల ఫెలోషిప్ 600 మంది విద్యార్థులకు ఇస్తే నేడు కేవలం 14 మంది విద్యార్థులకు మాత్రమే ఇవ్వడమంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయాల వలన పేద, సామాజిక తరగతుల విద్యార్థులు పరిశోధనకు దూరమవు తున్నారు. ఇచ్చే ఫెలోషిప్‌లకు నోటిఫికేషన్లు కూడా రెగ్యులర్‌గా ఇవ్వడం లేదు. బిసి విద్యార్థులకు రెండేళ్ల నుంచి ఫెలోషిప్ నోటిఫికేషనే ఇవ్వడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్లాట్లను కూడా పెంచలేదు. ఇచ్చే ఫెలోషిప్ సైతం రెగ్యులర్‌గా ఇవ్వడం లేదు. జెఆర్‌ఎఫ్ ఫెలోషిప్‌ను ఆరు నెలలకు ఒక్కసారి ఇస్తున్నారు. 2020లో ఐసిఎస్‌ఎస్‌ఆర్ ఫెలోషిప్‌కి నోటిఫికేషన్ ఇచ్చి అందరూ అప్లయి చేసుకొన్నాక సరైన కారణం చెప్పకుండానే నోటిఫికేషన్ తిరిగి రద్దు చేశారు. ఇచ్చే ఫెలోషిప్‌లలో కూడా పారదర్శకత లోపించింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్లకు వాళ్ళ అనుబంధ విద్యార్థులకు మాత్రమే ఫెలోషిప్‌లలో ప్రధాన్యత ఇవ్వడం బహిరంగ రహస్యంగా మారింది. గతంలో యూజీసీ నుండి నాన్ నెట్ ఫెలోషిప్ ఎన్‌ఎఎసి (ఏ గ్రేడ్) గుర్తింపు సాధించిన యూనివర్సిటీ విద్యార్థులకు నాన్ నెట్ ఫెలోషిప్ పేరుతో రూ.8 వేలు ఇచ్చేది. ఇప్పుడు ఈ ఫెలోషిప్‌ను నాలుగేళ్ల నుండి ఇవ్వడం లేదు. సోషల్ సైన్స్ సబ్జెక్టులలో విద్యార్థుల పట్ల వివక్షత ఉంది. యోగ, కర్మ, జ్యోతిష్యం లాంటి సబ్జెక్టులకు ప్రాధాన్యత కనపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల మరింత వివక్ష కనపడుతుంది. జాతీయ ఫెలోషిప్ రావాలంటే నెట్ పాస్ తప్పనిసరి అనే హేతుబద్ధత లేని నిబంధనను తీసుకో వచ్చి విద్యార్థులను ఫెలోషిప్‌కి దూరం చేస్తున్నారు.
ఫెలోషిప్ ఇవ్వడం వలన అణిచివేయబడిన జాతుల జీవితాలు, అసమానతలు, మనుధర్మ కుట్రలు, ఆర్థిక దోపిడీ తదితర కీలకమైన అంశాల మూలాల నుండి రీసెర్చి జరుగు తున్నది. ఇది మోడీ ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి పరిశోధనలు జరిగి వాస్తవాలు ప్రజల మధ్యకొస్తే దోపిడీ ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే ఫెలోషిప్‌లకు కోత పెడుతున్నారు. పైగా, ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేసే విద్యార్థులు ఎవరైనా యుజిసి పొందుపరిచిన అంశాల మీదనే రీసెర్చ్ చేయాలనే కొత్త నిబంధనను పెడుతున్నట్లు ప్రకటించారు.
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నియంతృత్వ విధానాలను ప్రశ్నించే పోరాట కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు మారాయి. దీనిలో అనేక మంది రీసెర్చ్ స్కాలర్లు, ఫెలోషిప్ వున్న విద్యార్థులు ఈ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. నోట్ల రద్దు నుండి సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ మొదలు కొని రైతు వ్యతిరేక చట్టాల వరకు ప్రతి విషయంలో మోడీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండ ఉద్యమాలు చేశారు. ఇది భరించలేని మోడీ ప్రభుత్వం ఫెలోషిప్‌లను తగ్గిస్తున్నదనేది వాస్తవం.
ఏదేశమైనా అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే అక్కడ పరిశోధనలు విస్తృతంగా జరగాలి. అలా జరగకుండా నిరోధించడం అంటే దేశాభివృద్ధిని నిలవరించడమే అవుతుంది.
- ఆర్.ఎల్. మూర్తి
సెల్: 8247672658